ప్రకృతి ఒడిలో మణిహారాలు
● అభివృద్ధి, చేస్తే అద్భుత క్షేత్రాలు
● పట్టించుకోని పాలకులు
కొయ్యూరు: ప్రకృతి ప్రేమికులను పరవశింపజేసే జలపాతాలు.. మదిని దోచే కొండకోనలు.. మండలంలో పర్యాటక సంపదకు కొదవలేదు. కానీ, అధికారుల నిర్లక్ష్యం, కనీస సౌకర్యాల లేమి ఆ అందాలను ఆస్వాదించాలనుకునే వారికి శాపంగా మారుతున్నాయి. ఇక్కడి నాలుగు ప్రధాన జలపాతాలు అభివృద్ధికి నోచుకోక వెలవెలబోతున్నాయి.
అందమున్నా.. అడుగులేయడం కష్టమే!
చింతవానిపాలెం సమీపంలోని ఇసుకలమడుగు జలపాతం చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. అంతటి అద్భుత దృశ్యాలను చూడాలంటే పర్యాటకులు సాహసమే చేయాలి. దాదాపు ఒక కిలోమీటరుకు పైగా కాలినడకన, కొండలు ఎక్కుతూ దిగుతూ వెళ్లడం వృద్ధులు, పిల్లలకు నరకంగా మారుతోంది. పర్యాటక శాఖ ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఈ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది.
మృత్యుఘోష వినిపిస్తున్నా..
గత 30 ఏళ్లుగా పర్యాటకులను ఆకర్షిస్తున్న గాదేగుమ్మి జలపాతం దగ్గర విషాద ఛాయలు కూడా ఎక్కువే. ఈ జలపాతం వద్ద ప్రమాదవశాత్తు జారి పడి ఇప్పటివరకు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం చూసి వెళ్లేందుకు వస్తే, తిరిగి రాని లోకాలకు వెళ్తున్న పర్యాటకుల ఉదంతాలు చూస్తుంటే.. ఇది పర్యాటక కేంద్రమా లేక మృత్యుకూపమా అన్న సందేహం కలగక మానదు.
● మృతుల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చిన ఈ జలపాతం దగ్గర, పర్యాటక శాఖ కనీసం భద్ర తా చర్యలు కూడా చేపట్టకపోవడం గమనార్హం. ఇక్కడ అరకొర సౌకర్యాలు కల్పించినా, అవి ఏమాత్రం సరిపోవు. భద్రతను పర్యవేక్షిస్తూ పర్యాటకుల కోసం అదనపు భవనాలు, రక్షణ గోడలు నిర్మించాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.
మౌలిక వసతులకు దూరం..సాకులపాలెం
బూదరాళ్ల పంచాయతీ సాకులపాలెం సమీపంలోని జలపాతానికి పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. అయితే అక్కడ అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు లేవు. కనీసం కూర్చునేందుకు నీడ, తాగడానికి నీరు వంటి ప్రాథమిక వసతులు కూడా లేనందున పర్యాటకులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు.
దారి లేని జలపాతం : రామరాజుపాలెం నుంచి గాంకొండ వెళ్లే మార్గంలో మరో అద్భుతమైన జలపాతం దాగి ఉంది. అయితే అక్కడికి చేరుకోవడం అంటే ఆకాశాన్ని అందుకోవడమే అన్న ట్టుంది పరిస్థితి. సరైన రహదారి లేక, కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి రావడంతో పర్యాటకులు వెనుకంజ వేస్తున్నారు.
మౌలిక వసతులు కల్పిస్తాం
జలపాతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తాం. కించవానిపాలెం జలాశయాన్ని కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంది. దీనిపై పూర్తి పరిశీలన అనంతరం చేపట్టబోయే పనుల వివరాలు వెల్లడిస్తాం
– తిరుమణి శ్రీపూజ, పీవో, పాడేరు ఐటీడీఏ
ప్రకృతి ఒడిలో మణిహారాలు
ప్రకృతి ఒడిలో మణిహారాలు


