నారాయణరెడ్డి హత్య కేసులో.. 11 మందికి జీవిత ఖైదు | 11 people sentenced to life imprisonment in Narayana Reddy case | Sakshi
Sakshi News home page

నారాయణరెడ్డి హత్య కేసులో.. 11 మందికి జీవిత ఖైదు

May 9 2025 3:56 AM | Updated on May 9 2025 3:56 AM

11 people sentenced to life imprisonment in Narayana Reddy case

ఐదుగురిని నిర్దోషులుగా తేల్చిన కర్నూలు జిల్లా ప్రిన్సిపల్‌ కోర్టు

మొత్తం 19 మందిలో ఒకరు చనిపోగా, ఇద్దరిపై కేసు తొలగింపు 

2017 మే 21న నారాయణరెడ్డి, అనుచరుడు సాంబశివుడు హత్య 

16 మందిపై తుది విచారణ అనంతరం నిందితులకు శిక్ష

కర్నూలు (సెంట్రల్‌)/వెల్దుర్తి: కర్నూలు జిల్లా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భర్త లక్ష్మీ­నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు బోయ సాంబశివుడు హత్య కేసులో 11 మంది నింది­తులపై నేరం రుజువైంది. వీరందరికీ జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి జి. కబర్థి గురువారం తీర్పు చెప్పారు. మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించారు. 2017 మే 21­న చెరుకులపాడు నారాయణరెడ్డి అనుచరుల­తో కలిసి కృష్ణగిరి మండలం రామకృష్ణాపురంలో పెళ్లికి రెండు వాహనాల్లో బయల్దేరారు. 

నిందితులు రెండు ట్రా­క­్టర్లలో వచ్చి నారాయణరెడ్డి కా­రు­ను ఢీకొట్టి నారా­యణరెడ్డిపై దాడిచేసి హత్యచేశారు. అడ్డుకోబోయి­న సాంబశివుడునూ అంతమొందించారు. కృష్ణగిరి పోలీసులు కేసు నమోదుచేసి 19 మందిపై చార్జి­షీటు దాఖలు చేశారు. నిందితులుగా ఉన్న ప్ర­స్తు­త పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ప్రస్తు­త వాల్మీకి ఫెడరేషన్‌ చైర్మన్‌ కప్పట్రాళ్ల బొజ్జమ్మ­లు హైకోర్టును ఆశ్రయించగా వీరి పేర్లు కేసు నుంచి తొలగించారు. ఏ4గా ఉన్న కోతుల రామా­ం­జనేయులు చనిపోవడంతో మొత్తం 16 మందిపై తుది విచారణ సాగింది. ఇందులో 11 మందికి జీవి­త ఖైదు పడగా, ఐదుగురిపై నేరం రుజువు కాలేదు. 

జీవిత ఖైదు పడిన నిందితులు వీరే.. 
కురువ రామాంజనేయులు, రామయ్యనాయుడు, కురువ రామకృష్ణ, కోతుల బాలు, కోతుల చిన్న ఎల్లప్ప, కోతుల పెద్ద ఎల్లప్ప, గంటల వెంకటరాముడు, గంటల శీను, బీసన్నగారి రామాంజనేయు­లు(40), బీసన్నగారి రామాంజనేయులు(42), బీసన్న­గారి పెద్ద బీసన్నలకు జీవితఖైదు పడింది. చాకలి నారాయణ, కర్రి గిడ్డయ్య, చెరుకులపా­డు గోపాల్, చిన్న వెంకటలను కోర్టు నిర్దోషులుగా ప్రక­టి­ంచింది. బీస­­న్నగారి పెద్ద బీసన్న వయ­స్సు ప్రస్తుతం 83 ఏళ్లు. 

నిందితుడు ఆత్మహత్యా యత్నం.. 
నిందితుల్లో ఒకరైన రామాంజనేయులును వాహనంలో కడపకు తీసుకెళ్తుండగా తలను వాహనం కిటికీకి కొట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు.  

కేఈ కుటుంబాన్ని నమ్ముకుంటే జైలుకే.. 
నారాయణరెడ్డి, బోయ సాంబశివుడు హత్యకేసులో తమకే ఎందుకు జీవితఖైదు పడిందని, కేఈ శ్యాంబాబుకు ఎందుకు శిక్ష పడలేదని నిందితులు కురువ రామాంజనేయులు, బీసన్నగారి రామాంజనేయులు ప్రశ్నించారు. కేఈ కుటుంబాన్ని నమ్ము­కుంటే జైలుకు పోవాల్సిందేనని, ఆ కుటుంబాన్ని ఎవరూ నమ్మొద్దని.. వారెలాంటి సాయం చేయరని, తమకు తగిన శాస్తి జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.

చట్టం, కోర్టులపై నమ్మకం పెరిగింది.. 
నారాయణరెడ్డి సతీమణి,మాజీఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి 
అనంతరం.. కర్నూలులోని తన స్వగృహంలో నారాయణరెడ్డి సతీమణి, కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఈ అంశంపై స్పందించారు. కోర్టు తీర్పుతో, పోలీసులు కేసులో చూపిన తెగువతో తమకు, ప్రజలకు చట్టంపై, కోర్టులపై నమ్మకం పెరుగుతోందన్నారు.  తన భర్త నారాయణరెడ్డి బతికుంటే ఎమ్మెల్యే కాలేమన్న భయంతోనే కేఈ శ్యాంబాబు కుట్ర పన్ని హత్య చేయించారని ఆమె ఆరోపించారు. 

నారాయణరెడ్డి హత్య కేసు తీర్పును చూసి ప్రజలు కక్షపూరిత రాజకీయాలకు దూరంగా ఉండాలని శ్రీదేవి విజ్ఞప్తి చేశారు. నారాయణరెడ్డి సోదరుడు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. కేఈ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడే తన తండ్రిని, తన సోదరుడిని పోగొట్టుకున్నామన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement