అనంతపురం ఎడ్యుకేషన్: మొదటి విడత పల్లె పోరులో తొలి అడుగు పడింది. 218 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆదివారం ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. సర్పంచ్ స్థానాలకు 309, వార్డు సభ్యుల స్థానాలకు 281 కలిపి మొత్తం 590 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో రానున్న రెండు రోజుల్లో ఎన్నికల వేడి మరింత పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.
అనంతపురం రూరల్‌లో జోరు..
కంబదూరులో తక్కువ
తొలిరోజు నామినేషన్ల దాఖలులో అనంతపురం రూరల్ మండలం ముందంజలో నిలిచింది. ఈ మండలంలో సర్పంచ్ స్థానాలకు 54, వార్డు స్థానాలకు 63 చొప్పున అత్యధికంగా 117 నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు కంబదూరు మండలంలో సర్పంచ్ స్థానాలకు 11 నామినేషన్లు మాత్రమే వచ్చాయి. వార్డు స్థానాలకు మండలం మొత్తం మీద ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. మండలాల వారీగా చూస్తే నామినేషన్ల దాఖలులో భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. తమపేరు సెంటిమెంట్ ఆధారంగా ముహూర్తాలు చూసుకుని దాఖలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తిచూపుతున్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు..
జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియలో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా సాగేందుకు అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి నామినేషన్ కేంద్రంలోనూ సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ ప్రత్యేక పర్యవేక్షణతో పోలీసు, ఎన్నికల యంత్రాంగం సమన్వయంతో పనిచేసింది. ఫలితంగా తొలిరోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నామినేషన్ల స్వీకరణ సజావుగా ముగిసింది.
రెండో రోజు నుంచి మరింత సందడి..
నామినేషన్ల ప్రక్రియకు ఇంకా రెండు రోజులు గడువు ఉండటంతో రెండవ, మూడవ రోజుల్లో నామినేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా సర్పంచ్, వార్డు స్థానాలపై ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కనుంది.
తొలిరోజే 590 నామినేషన్లు
218 పంచాయతీల్లో ప్రశాంతంగా నామినేషన్ల స్వీకరణ
సర్పంచ్ స్థానాలకు 309,
వార్డు స్థానాలకు 281 నామినేషన్లు


