ప్రశాంతి నిలయం: సత్యసాయిబాబా నడయాడిన నేల ఉత్సవ శోభను సంతరించుకుంది. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు.
సత్యసాయి జయంతి వేడుకల షెడ్యూల్ ఇలా..
శత వర్ష వేడుకల్లో భాగంగా 16న సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత గంగాతరంగా పేరుతో గంగా శశిధరన్ బృందం సంగీత కచేరీ నిర్వహిస్తారు. సత్యసాయి స్పీక్స్ అఫీషియల్ పేరుతో తెలుగులో సాయివాణి యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభిస్తారు. 17న విండ్ అండ్ విస్పరింగ్ ప్రేయర్స్ పేరుతో ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిట్ రాకేష్ చౌరాసియా బృందం సంగీత కచేరీ నిర్వహిస్తుంది. 18న ఉదయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి నారాయణ వ్రతం, వేణుగోపాలస్వామి రథోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం కేసాడే ఆఫ్ డివైన్ మెలోడీ పేరుతో శ్వేతా మోహన్ బృందం సంగీత కచేరి ఉంటుంది. 19న మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వేడుకల్లో భాగంగా కర్ణాటక రాష్ట్రం మాజీ చీఫ్ సెక్రటరీ వందితా శర్మ, ప్రముఖ సినీనటి రష్మికా మందన్నా మహిళా దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 20 నుంచి రెండు రోజుల పాటు ఆల్ ఇండియా సేవాదళ్ సదస్సు నిర్వహిస్తారు. 22న సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్ 45వ స్నాతకోత్సవాన్ని పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహిస్తారు. సాయంత్రం హృదయ వందన పేరుతో సంగీత కచేరీ ఉంటుంది. వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు. 23న సత్యసాయి శత వర్ష జయంతి వేడుకలను హిల్ వ్యూ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సత్యసాయి జోలోత్సవం, శతవర్ష సంగీత కచేరీ నిర్వహిస్తారు. 24న సర్వం సాయి మయం పేరుతో నృత్యరూపకాన్ని ప్రదర్శిస్తారు.
నేటి నుంచి నారాయణ సేవ
సత్యసాయి శత వర్ష జయంతిని పురస్కరించుకుని సోమవారం నుంచి ప్రశాంతి నిలయంలో నారాయణ సేవ నిర్వహించనున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి అన్నదానం చేస్తారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా భక్తులకు టీ, కాఫీలను అందిస్తారు. ఇప్పటికే ప్రశాంతి నిలయం నార్త్ మైదానంతో పాటు వెస్ట్ గేట్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ముగిసిన అఖండ భజన
ప్రశాంతి నిలయంలో సత్యసాయి శత వర్ష జయంతి వేడుకలను పురస్కరించుకుని చేపట్టిన అఖండ భజన ఆదివారం సాయంత్రం ముగిసింది. శనివారం సాయంత్రం ప్రారంభమైన అఖండ భజన 24 గంటల పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. వేలాది భక్తులు అఖండ భజనలో పాల్గొన్నారు.
నేటి నుంచి 24 వరకు సత్యసాయి
శత వర్ష జయంతి వేడుకలు
18న వేణుగోపాల స్వామి రథోత్సవం, 22న స్నాతకోత్సవం
ముఖ్య అతిథిగా హాజరు కానున్న
గవర్నర్ అబ్దుల్ నజీర్
23న హిల్‌వ్యూ స్టేడియంలో
సత్యసాయి జయంతి వేడుకలు


