ఉరవకొండ: ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. తాగునీరు అందక గొంతెండిపోతున్నా అధికారులు కానీ, పాలకులు కానీ పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి రాష్ట్రంలో కొలువు దీరగానే తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉదిరిపికొండ నుంచి ఉరవకొండకు ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఇక నుంచి తాగునీటి కష్టాలు ఉండవని, ప్రతి రోజూ కొళాయిలకు నీరు వస్తుందని అధికార పార్టీ నేతలు ప్రచారం చేశారు. కానీ చెప్పినట్టు జరగలేదు. నీటి సరఫరాలో ఎటువంటి మార్పూ లేదు. 15 రోజులకు ఒకసారి కూడా తాగునీరు సరఫరా కావడం లేదు. నిర్వహణ సరిగా లేనందున నీరు వదిలినప్పుడు కొన్ని ప్రాంతాల్లో తాగునీరు కొళాయిలకు సరిగా రావడం లేదు. పలు చోట్ల నీరు కలుషితమై రంగు మారి, మురికిగా వస్తోంది. ఇలాంటి నీటిని ఎలా తాగాలంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆదివారం ఇందిరానగర్ ఆరవ లైన్‌లోని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. నెలకు రెండు రోజులు మాత్రమే నీరు ఇస్తే.. మిగిలిన రోజుల్లో పరిస్థితి ఏమిటని నిలదీశారు. మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించి మేజర్ పంచాయతీలో తాగునీటి సరఫరాను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు.
మంత్రి కేశవ్ ఇలాకాలో దాహం కేకలు
నెలకు రెండు రోజులు నీరొస్తే గగనం
కూటమి ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం
నీళ్లివ్వకపోవడం సిగ్గుచేటు
పట్టణంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అధికారులేమో నీళ్లు వదులుతున్నాం అంటారు. కానీ కొళాయిలకు నీళ్లు వస్తున్నాయా లేదా అని మాత్రం చూడరు. తాగునీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా ఏమీ పట్టించుకోవడం లేదు. తాగునీరు లాంటి కనీస సౌకర్యం కల్పించకపోవడం సిగ్గుచేటు. – మునీశ్వరి, ఉరవకొండ
నీటిని కొంటున్నాం
ఉరవకొండలో తాగునీరు దొరకడం లేదు. నెలలో రెండుసార్లు కూడా నీరు వదలడం లేదు. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. ప్రైవేట్ వాటర్ ప్లాంట్లు, ట్యాంకర్లను ఆశ్రయించి క్యాన్ రూ.20 చొప్పున కొనాల్సి వస్తోంది. సంవత్సరాల తరబడి సమస్య ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా..? – కళావతి, ఉరవకొండ


