● పెద్దకౌకుంట్లలో ఏర్పాటుపై రాకెట్ల,
ఆమిద్యాల ప్రజల అభ్యంతరం
ఉరవకొండ: మంత్రి పయ్యావుల కేశవ్ స్వగ్రామం కౌకుంట్లలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేయడంపై సమీప గ్రామాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండ మండలంలోని 18 గ్రామపంచాయతీ సర్పంచ్, 196 వార్డు సభ్యుల స్థానాలకు మూడో విడతల డిసెంబర్ రెండో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఆమిద్యాల, పెద్దకౌకుంట్ల, రాకెట్ల పంచాయతీల సర్పంచ్ వార్డు స్థానాల ఎన్నికలకు సంబంధించి పెద్దకౌకుంట్లలోని పీఏసీఎస్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నామినేషన్ కేంద్రం ఏర్పాటుపై రాకెట్ల, ఆమిద్యాల గ్రామాల ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో పెద్దకౌకుంట్లలో టీడీపీ నేతలు ఏకపక్షంగా పోలింగ్ చేసుకోవడం, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎన్నికల బరిలో ఉండకుండా దాడులు, కిడ్నాప్‌లు చేయడం ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కౌకుంట్లలోని రెండు ఎంపీటీసీ స్థానాలు దళితులకు కేటాయించారు. ఈ స్థానాలకు వైఎస్సార్‌సీపీ తనఫున ఇద్దరు అభ్యర్థులను నామినేషన్ వేయడానికి సిద్ధం చేస్తే.. వారిని రాత్రికిరాత్రే కిడ్నాప్ చేయించి కొందరు వారు నామినేషన్ వేయనీయకుండా చేశారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో కౌకుంట్లలో నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తే ఎన్నో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని రాకెట్ల, ఆమిద్యాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దకౌకుంట్ల కంటే పెద్దది అయిన ఆమిద్యాల పంచాయతీలోనే నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలతో పాటు వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
నేటి నుంచి
‘విజయపథం’ అమలు
● కేజీబీవీలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
● సమగ్రశిక్ష ఏసీపీ, జీసీడీఓ
అనంతపురం ఎడ్యుకేషన్: కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థినులు వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ‘వంద రోజుల విద్యా ప్రణాళిక – విజయపథం’ సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. జిల్లాలోని అన్ని కేజీబీవీల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ వంద రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థినులకు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక అధ్యయన ప్రణాళిక రూపొందించి, రోజూ ప్రత్యేక బోధన, పునశ్చరణ తరగతులు నిర్వహించనున్నారు. నిర్ణీత లక్ష్యాల ప్రకారం సిలబస్‌ను పూర్తి చేసి, విద్యార్థినులను పరీక్షలకు సమగ్రంగా సన్నద్ధం చేయనున్నారు. విద్యార్థినుల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు రోజువారీ పరీక్షలు, గత ప్రశ్నపత్రాల సాధన, మోడల్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థినుల్లోని అభ్యసన లోపాలను గుర్తించి, చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు. ప్రతి విద్యార్థినీ పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా ఉపాధ్యాయులు మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందించనున్నారు. కేజీబీవీ ప్రిన్సిపాళ్లు, సబ్జెక్టు అధ్యాపకులు సమన్వయంతో పనిచేస్తూ రోజూ విద్యార్థినుల విద్యా ప్రగతిని సమీక్షించాలని సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, జీసీడీఓ కవిత సూచించారు.
రాత్రికి రాత్రే
మిర్చి పంట మాయం
కళ్యాణదుర్గం రూరల్: ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంట చేతికొచ్చిన సమయంలో దొంగలు కోసుకెళ్లారు. దీంతో బాధిత మహిళా రైతు లబోదిబోమంటున్నారు. బెళుగుప్ప మండలం కోనాపురం గ్రామానికి చెందిన రైతు ఎర్రమ్మ రెండెకరాల్లో రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి మిర్చి సాగు చేసింది. పంట కోత దశకు చేరుకోగానే గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే పంటను ఖాళీ చేశారు. ఆదివారం ఉదయం తోట వద్దకు వెళ్లి చూడగా మిర్చి దంట్లు తప్ప.. మిర్చి (మిరప కాయలు) కనిపించలేదు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు పంటను దోచుకెళ్లారని బాధితురాలు కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. దాదాపుగా రూ.5 లక్షలు నష్టపోయానని బాధితురాలు బోరున విలపించింది.


