పెద్దపప్పూరు: అరటి ధర అమాంతం పడిపోయింది. రైతు కష్టం వృథా అవుతోంది. మండలంలో 5 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అరటి సాగు చేశారు. ఎకరాకు రూ.లక్ష దాకా ఖర్చు చేశారు. టన్ను రూ.10వేలకు పైబడి ఉంటే గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం టన్ను రూ.3వేల నుంచి రూ.4వేలు మాత్రమే పలుకుతోంది. అయితే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో వచ్చిన అరకొర వ్యాపారులు కూడా మరింత తక్కువకు కొంటున్నారు. నెల రోజులుగా ధరల్లో ఎటువంటి పెరుగుదలా కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అరటి గిట్టుబాటు కాకపోవడంతో కొట్టాలపల్లి తదితర గ్రామాల్లోని రైతులు గెలలను గొర్రెలకాపరులకు ఇచ్చేస్తున్నారు. అనంతరం జేసీబీ పెట్టి పంటను తొలగిస్తున్నారు.


