● ప్రత్యామ్నాయం చూపకపోవడంతో అధికారులపై ప్రయాణికుల మండిపాటు
కూడేరు: ఆర్టీసీ బస్సు ముందు టైర్ పంక్చర్ కావడం.. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. వివరాలు.. ఆదివారం మండలంలోని గొటుకూరు రోడ్డు క్రాస్ సమీపాన అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారిపై అనంతపురం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ముందు టైర్ పంక్చర్ కావడంతో.. టైర్ చీలిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బ్రేకులు వేయడంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. బస్సు ఉరవకొండ నుంచి అనంతపురం వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అందులో సుమారు 40 మందికి పైగానే ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రత్యామ్నాయ బస్సు కోసం ప్రయాణికులు గంటల తరబడి రహదారిపైనే వేచి ఉండాల్సి రావడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. బస్సుల నిర్వహణ, కండీషన్‌పై అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవతున్నాయని ప్రయాణికులు మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.


