● ప్రమాదంలో పేలిన సిలిండర్
● రూ.3లక్షల మేర ఆస్తి నష్టం
గార్లదిన్నె: మండల పరిధిలోని కనంపల్లి క్రాస్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో హోటల్ దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు మేరకు జాతీయ రహదారి పక్కనే కిషోర్ బాబు ప్రిన్స్ హోటల్, టీ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మధ్యాహ్న సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా హోటల్‌లో మంటలు వ్యాపించడంతో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో హోటల్లోని ఫ్రీజ్, వస్తువులు కాలి బూడిదయ్యాయి. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న నిర్వాహకుడు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా తగ్గకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంతో రూ.3లక్షల మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్టు బాధితుడు వాపోయాడు.


