తాడిపత్రిటౌన్: చంద్రబాబు ప్రభుత్వంలో రాక్షస పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఖాదర్‌బాషా విమర్శించారు. బుధవారం తాడిపత్రిలోని వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఫయాజ్ బాషా ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ అధికార పార్టీ నాయకుల దురాగతాలు, దుశ్చర్యలపై నేషనల్ మీడియా దుమ్మెత్తి పోసిందన్నారు. నామినేషన్లు వేయడానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులకు పాల్పడడం అప్రజాస్వామికమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించి పాలన సాగిస్తోందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను నెరవేర్చిన ఘనత ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ తగిన రాజకీయ ప్రాధాన్యతిస్తోందని, అందుకే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఫయాజ్ బాషాకు అవకాశం ఇచ్చిందని తెలిపారు. తాడిపత్రిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలని ఆయన పోలీసులను కోరారు.
దమ్ముంటే ప్రజల ఓట్లతో గెలువు జేసీ?
: ఫయాజ్ బాషా
అధికారాన్ని అడ్డుపెట్టుకొని నామినేషన్ల దాఖలు వేళ విధ్వంసకాండకు పాల్పడి 30 వార్డులు ఏకగ్రీవం చేసుకోవడం ప్రజాస్వామ్యబద్ధమా అని వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఫయాజ్‌బాషా ప్రశ్నించారు. కనీసం తనను ప్రచారం చేయనీకుండా పోలీసులతో అడ్డుకోవడమే కాక కార్యకర్తలను బెదిరింపులకు దిగుతుండడం దౌర్భగ్యమన్నారు. జేసీ కుటుంబానికి దమ్ముధైర్యం ఉంటే ప్రజలతో ఓటు వేయించుకొని గెలవాలని సవాల్ విసిరారు. తన జీవితంలో ఇటువంటి దుర్మార్గపు ఎన్నికలు చూడలేదని, జేసీకి ఓటమిపై అంత భయముంటే నేరుగా చంద్రబాబుతో మాట్లాడుకొని నామినేట్ విధానంలో చైర్మన్, కౌన్సిలర్లను నియమించుకోవాల్సింది అని ఎద్దేవా చేశారు. గత మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా జరగడంతోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయ్యారని గుర్తు చేశారు. తాడిపత్రిలో దౌర్జన్యాలను అరికట్టాలంటే వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకొవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే జేసీ కుటుంబం దమనకాండ సాగిస్తోందన్నారు. వారి ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ వింగ్ జనరల్ సెక్రటరీ నదీం వున్నారు.
వైఎస్సార్‌సీపీలోనే మైనార్టీలకు ప్రాధాన్యత
ఓటమి భయంతోనే తాడిపత్రి జేసీ దుశ్చర్యలు
విలేకరుల సమావేశంలో మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌బాషా


