● అభ్యర్థుల నుంచి ఖాకీ వసూల్
● లేకపోతే ఇబ్బందులు తప్పవని బెదిరింపు
అనంతపురం సెంట్రల్: నగరపాలక సంస్థ ఎన్నికల వేళ పోలీస్ స్టేషన్లకు అభ్యర్థుల నుంచి కాసులు గలగలలు మొదలయ్యాయి. ఖాకీల నుంచి వస్తున్న డిమాండ్ చూసి అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. ఓ పోలీసుస్టేషన్ పరిధిలో ఒక అభ్యర్థి నుంచి రూ.1.50 లక్షలు ‘స్టేషన్ ఖర్చుల నిమిత్తం’ ఇవ్వాలని కోరగా.. అంత ఇచ్చుకోలేనని, రూ.లక్ష ఇస్తానని చెబితే.. అందుకు ససేమిరా అన్నారు. చేసేది లేక ఆ అభ్యర్థి అడిగినంత ముట్టచెప్పారు. అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీనా అనే తేడా లేకుండా అభ్యర్థులందరినీ డిమాండ్ చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో అభ్యర్థులు స్టేషన్లకు ముట్టజెబుతున్నారు. ఈ నెల 30వ తేదీతో అభ్యర్థుల ప్రచారం ముగియనుండగా.. రేపు నెల ఒకటో తేదీన మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
నో డ్యూస్ నుంచి స్టేషన్ ఖర్చుల దాకా...
నామినేషన్లకు ముందు నుంచే ఖాకీ వసూళ్లు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు నామినేషన్ వేయాలంటే ముందుగా పోలీసు స్టేషన్ నుంచి ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఇందు కోసం ఒక్కొక్కరి నుంచి రూ.3 వేల వరకూ వసూలు చేశారు. నగరంలో ఓ పోలీసుస్టేషన్‌కు ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ల రూపంలోనే దాదాపు రూ.3 లక్షలకు పైగా వసూలైంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో నిలిచిన అభ్యర్థుల నుంచి రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు అందినకాడికి ‘స్టేషన్ ఖర్చుల’ పేరుతో అనధికారికంగా గుంజుతున్నారు. ఇందు కోసం క్రైమ్‌పార్టీ, ప్రొటోకాల్ డ్యూటీల్లో ఉండే సిబ్బందిని వినియోగించుకున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 62 డివిజన్లలో కార్పొరేటర్ స్థానాల నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచే 124 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇండిపెండెంట్, ఇతర పార్టీల అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ఈ లెక్కన రూ.కోట్లలో దండుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఎన్నికలకు మైన్స్ ప్రూఫ్ వాహనం సిద్ధం
అనంతపురం సెంట్రల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కునేందుకు పోలీసు అధికారులు మైన్స్ ఫ్రూఫ్ వాహనాన్ని సిద్ధం చేశారు. బుధవారం పోలీసు కార్యాలయంలో ఎస్పీ జగదీష్ వాహన పనితీరును పరిశీలించారు. అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.


