భక్తిశ్రద్ధలతో దీపారాధనోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో దీపారాధనోత్సవాలు

Oct 29 2026 1:24 AM | Updated on Oct 29 2026 1:24 AM

బొమ్మనహాళ్‌: దర్గాహొన్నూరులోని సర్మాస్‌ హుస్సేని స్వామి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా బుధవారం మొదటిరోజు దీపారాధనోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి దర్గా వద్ద పెద్దసంఖ్యలో భక్తులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు దివ్వెలను దర్గా చుట్టూ వెలిగించడంతో దర్గాకు ప్రత్యేక కళ సంతరించుకుంది. అనంతరం భక్తులు స్వామి సమాధిని దర్శించుకుని పూలమాలలు సమర్పించి, చక్కెర చదివింపులు చేయించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు రద్దీని దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. గురువారం రెండవ దీపారాధనోత్సవం జరుగుతుందని తెలియజేశారు.

పోస్టల్‌ బ్యాలెట్‌కు

నేడు చివరి రోజు

అనంతపురం కల్చరల్‌: పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేందుకు గురువారం చివరి రోజు అని అదనపు ఎన్నికల అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్‌ జశ్వంతరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు వినియోగించుకోని అర్హులైన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలలోపు వినియోగించుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం 277 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, మొత్తం రెండురోజుల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రంలో 511 పోస్టల్‌ బ్యాలెట్లు నమోదు అయినట్లు వెల్లడించారు.

మూడు జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం

అనంతపురం న్యూ టౌన్‌: అనంతపురం జిల్లాలో మూడు జెడ్పీటీసీస్థానాలు ఏకగ్రీవమయ్యాయని జిల్లా పరిషత్‌ సీఈఓ, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక జెడ్పీ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ గుత్తి మండలానికి చెందిన జెడ్పీటీసీ అభ్యర్థి నల్లబోతుల స్వాతి, పామిడి జెడ్పీటీసీ అభ్యర్థి పల్లె శ్రీనివాసులు, గుంతకల్లు జెడ్పీటీసీ అభ్యర్థి డి.గీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా వారికి ఆమె డిక్లరేషన్‌ పత్రాలు అందజేశారు.

ఎన్నికల ప్రచారంలో వీఆర్‌ఏ

రాప్తాడు రూరల్‌: ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలి. అందులోనూ ఎన్నికల సమయంలో మరింత నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అయితే అనంతపురం రూరల్‌ మండలం చియ్యేడు గ్రామానికి చెందిన వీఆర్‌ఏ చెన్నయ్య అధికార పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం చియ్యేడులో టీడీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే పరిటాల సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వీఆర్‌ఏ కూడా పాల్గొని ఇంటింటికీ తిరగడం గమనార్హం. దీనిపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రద్దు

తాడిపత్రి రూరల్‌ : విశాఖ నుంచి తాడిపత్రి మీదుగా గుంతకల్లుకు వెళ్లాల్సిన 18521 నంబర్‌గల తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను అర్నబ్‌ తుపాన్‌ కారణంగా బుధవారం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. గుంతకల్లు నుంచి తాడిపత్రి మీదుగా విశాఖ వెళ్లాల్సిన తిరుమల ఎక్స్‌ప్రెస్‌ యథావిధిగా బయలుదేరి వెళ్లింది. ధర్మవరం– మచిలీపట్నం వెళ్లే 17216 నంబర్‌గల ఎక్స్‌ప్రెస్‌ నిర్ణీత వేళకే బయల్దేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement