● పార్టీ కోసం దశాబ్దాలుగా పని చేసినా గుర్తింపు లేకపోవడంతో ఆవేదన
నార్పల : పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసినా సరైన గుర్తింపు, గౌరవం లేకపోవడంతో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర నాయకుడు రామ్మోహన్ చౌదరి ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నార్పల మండలం గంగనపల్లికి చెందిన ఆయన సుదీర్ఘకాలంగా టీడీపీ అనుబంధ రైతు విభాగంలో పనిచేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన నార్పల జెడ్పీటీసీ స్థానాన్ని ఆశించారు. నామినేషన్ కూడా దాఖలు చేశారు. పార్టీ బీ–ఫామ్ ఆయనకు కాదని ఆకుల అరుణకు ఇవ్వడంతో తీవ్ర ఆవేదన గురైన రామ్మోహన్ తన రాజీనామా పత్రాన్ని ఆ పార్టీ జిల్లా పరిశీలకుడు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజుకు పంపారు. స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీ ఎన్నికల బరిలో తలబడుతున్నారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేసిన సీనియర్లకు తగిన గౌరవం లభించకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


