సాక్షి ప్రతినిధి, అనంతపురం: బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు...బ్యాక్ బోన్ క్లాసెస్ అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారికి అధికారంలో భాగస్వామ్యం కల్పించారు. రిజర్వేషన్ పాటిస్తూనే జనరల్ స్థానాల్లోనూ బీసీలను నిలబెట్టి గెలిపించారు. దీంతో బీసీలంతా వైఎస్సార్‌సీపీకి దగ్గర కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు రిజర్వేషన్ నాటకానికి తెరతీశారు. గత ఎన్నికల సమయంలో బీసీ వర్గాల ఓట్లు రాబట్టాలనే ఉద్దేశంతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ తెస్తానని ఊరూరా హామీలు గుప్పించారు. అయితే అధికారం చేపట్టిన తర్వాత జీఓ మాత్రం ఇచ్చారు. రెండేళ్లు దాటినా చట్టం మాత్రం చేయలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇస్తామంటూ ప్రచారం హోరెత్తించారు. ఎవరు హైకోర్టును ఆశ్రయించినా రిజర్వేషన్ చెల్లదంటూ తీర్పు వస్తుందని తెలిసి కావాలనే అబద్ధాలు వల్లించారు. ఇప్పుడు ఆయన ఊహించిన తీర్పే రావడంతో లోలోన ఆనందపడుతూనే... బీసీ నేతల వద్ద మాత్రం మొసలి కన్నీరుకారుస్తున్నారు.
ఓట్ల కోసమే కపట నాటకం
మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటే అంశంపై న్యాయపరమైన వివాదాలు, గతంలో కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ అదే అంశంపై మరోసారి చంద్రబాబు జీఓ వల్ల బీసీలను గందరగోళంలోకి నెట్టారు. గ్రామీణ పంచాయతీల్లో 34 శాతం, పట్టణాల్లో 33.33 శాతం కోటా కల్పించేలా రెండు జీఓలు 105, 1065లను విడుదల చేశారు. ఈ జీఓలు చట్టం ముందు నిలవవని తెలిసీ చంద్రబాబు రాజకీయంగా బీసీలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం విస్మయపరుస్తోంది. చట్టానికి బదులుగా కేవలం జీఓలతో కాలయాపన చేస్తుండడంపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
వైఎస్సార్‌సీపీ హయాంలో బీసీలకు రాజ్యాధికారం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు నిజమైన రాజ్యాధికారం దక్కింది. స్థానిక సంస్థలతో పాటు నామినేటెడ్ పదవుల్లో వారికి అత్యంత ప్రాధాన్యత కల్పించారు. రిజర్వేషన్ పాటిస్తూనే..జనరల్ స్థానాల్లోనూ బీసీలను నిలబెట్టి గెలిపించారు. దీనివల్ల పలువురు బీసీలు పదవులను అలంకరించారు. మునిసిపల్ ఎన్నికల్లో హిందూపురం, పుట్టపర్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం వంటి స్థానాల్లో బీసీ వర్గాలకు చెందిన వారికి చైర్‌పర్సన్లుగా అవకాశం కల్పించి వైఎస్ జగన్ తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారు. అలాగే ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్..తదితర పదవుల్లోనూ బీసీలకు ప్రాధాన్యత దక్కేలా చొరవ చూపారు. అలాగే రాష్ట్రంలో మొత్తం 13 మేయర్ స్థానాల్లో 9 (69 శాతం), 13 జడ్పీలలో 6 (46 శాతం) బీసీలకు ఇచ్చారు. రాజ్యసభ స్థానాల్లో 4, లోక్‌సభ స్థానాల్లో 11 స్థానాలను బీసీలకు కేటాయించారు. ఎమ్మెల్సీల్లో 48 శాతం, మున్సిపల్ చైర్‌పర్సన్లలో 53 శాతం, ఎంపీపీలలో 68 శాతం మేర బీసీలకు ప్రాతినిధ్యం కల్పించి వైఎస్సార్‌సీపీ చరిత్ర సృష్టించింది.
నమ్మించడం...వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య. ఇన్నాళ్లూ రిజర్వేషన్లతో బీసీలను ఊరించిన ఆయన..తాజాగా హైకోర్టు తీర్పు అంటూ సరికొత్త ఎన్నికల నాటకానికి తెరతీశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చంద్రబాబు సర్కార్ ఇచ్చిన జీఓ చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదంతా ముందే ఊహించిన చంద్రబాబు.. హమ్మయ్యా టికెట్లన్నీ తమవాళ్లకే ఇచ్చుకోవచ్చని లోలోన సంబరపడుతుండగా.. ‘పచ్చ’డ్రామాపై బీసీలంతా భగ్గుమంటున్నారు.
34 శాతం రిజర్వేషన్లను కొట్టేసిన హైకోర్టు ఆరు వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని తీర్పు
కోర్టులో కేసు నిలవదని తెలిసీ బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు డ్రామాలు
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర?
సుప్రీం తలుపు తట్టడంపై సర్వత్రా విమర్శలు
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓలను హైకోర్టు డిస్మిస్ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. సుప్రీం మార్గదర్శకాల మేరకే హైకోర్టు తీర్పును ఇచ్చినా చంద్రబాబు డ్రామాలు ఆపడం లేదు. మొత్తం రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి దాటకూడదని దేశ అత్యన్నత న్యాయస్థానం ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ, చంద్రబాబు ఆడుతున్న డ్రామాలను చూస్తుంటే బీసీలపై ఆయనకు చిత్తశుద్ధి లేదన్న విషయం స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


