అనంతపురం అగ్రికల్చర్: నల్లరేగడి భూములు ఉన్న 20 మండలాల్లో రబీ పంటగా పప్పుశనగ సాగు చేసే రైతులకు 35 శాతం రాయితీతో 32,900 క్వింటాళ్ల జేజీ–11 రకం ట్రూత్‌ఫుల్ లేబుల్ (టీఎల్) విత్తనం పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి తెలిపారు. ప్రాసెసింగ్ ప్లాంట్లలో విత్తనశుద్ధి చురుగ్గా కొనసాగుతుండగా... ఇప్పటికే 2 వేల క్వింటాళ్లు ఆర్‌ఎస్‌కేలకు చేరాయన్నారు. వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్ ఆధ్వర్యంలో ఒకవైపు రిజిస్ట్రేషన్లు, మరో వైపు పంపిణీ ప్రక్రియ చేపడతామని పేర్కొన్నారు. 60 వేల హెక్టార్లు అంచనా వేసినా... వర్షం వస్తే 70 వేల నుంచి 80 వేల హెక్టార్లలో సాగు చేసే అవకాశం ఉందన్నారు. జిల్లాకు 32,900 క్వింటాళ్లు కేటాయించగా... భూ విస్తీర్ణాన్ని బట్టి మండలాలకు విత్తన కేటాయింపులు చేశామని వివరించారు. అత్యధికంగా పుట్లూరు మండలానికి 5,800 క్వింటాళ్లు, అలాగే తాడిపత్రి 4 వేలు, కణేకల్లు 3,200 , విడపనకల్లు 3,100, బెళుగుప్ప 2,870, పెద్దపప్పూరుకు 2 వేలు, బొమ్మనహాళ్‌కు 1,400, వజ్రకరూరు 1,200, యాడికి 1,150, డీ.హీరేహాళ్ 1,000, ఉరవకొండ, యల్లనూరుకు 3 వేల క్వింటాళ్ల చొప్పున కేటాయించామన్నారు. పంట సాగు తక్కువగా ఉన్న గుత్తికి 350 క్వింటాళ్లు, బుక్కరాయసముద్రం, గుంతకల్లుకు 200 క్వింటాళ్లు, కూడేరు 150 క్వింటాళ్లు, ఆత్మకూరు, పెద్దవడుగూరు 100 క్వింటాళ్ల చొప్పున, శింగనమలకు 50 క్వింటాళ్లు, గార్లదిన్నెకు 30 క్వింటాళ్ల విత్తనం కేటాయించినట్లు తెలిపారు. జాతీయ నూనెగింజల అభివృద్ధి పథకం కింద జిల్లాలో 3 వేల హెక్టార్లలో తెల్లకుసుమ పంట సాగుకు వీలుగా ఎంపిక చేసిన రైతులకు ఐఎస్‌ఎఫ్–700 రకం తెల్లకుసుమ విత్తనాలు 300 క్వింటాళ్లు 100 శాతం రాయితీతో పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైన రైతులు మండల వ్యవసాయాధికారిని సంప్రదించి వినియోగించుకోవాలని సూచించారు.
పప్పుశనగ తెల్లకుసుమ
35 శాతం రాయితీతో జిల్లాకు 32,900 క్వింటాళ్లు
అత్యధికంగా పుట్లూరుకు 5,800 క్వింటాళ్ల కేటాయింపు
100 శాతం రాయితీతో 300 క్వింటాళ్ల తెల్లకుసుమ


