అనంతపురం సిటీ: పీసీపీఎన్‌డీటీ చట్టం అమలుపై ఢిల్లీ వేదికగా గురువారం జరిగిన జాతీయ సదస్సులో ఏపీ తరఫున వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర అదనపు సంచాలకుడు డాక్టర్ అనిల్‌కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారి నాగరాజు, ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారి శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహించారు. ఈ సందర్భంగా ఏపీలో గర్భస్త శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలును వారు కేంద్ర ఉన్నత స్థాయి కమిటీకి వివరించారు.
రాష్ట్రస్థాయి బాక్సింగ్
పోటీలకు విద్యార్థి
అనంతపురం ఎడ్యుకేషన్: బాక్సింగ్‌లో నార్పల మండలం గూగూడు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి కె.నాగచైతన్య ప్రతిభ చాటాడు. అనంతపురం నగరంలోని అశోక్‌నగర్ ఇండోర్ స్టేడియంలో గురువారం నిర్వహించిన ఎంపిక పోటీల్లో అండర్–14 బాలుర 45 కేజీల విభాగంలో పోటీపడి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థి ఎంపికవ్వడంపై హెచ్‌ఎం మదన్‌మోహన్‌రెడ్డి, పీడీ శ్రీదేవి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి, అభినందనలు తెలియజేశారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
బొమ్మనహళ్: అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో సెప్టెంబర్ 30 నిర్వహించిన జిల్లాస్థాయి హ్యాండ్‌బాల్ సెలక్షన్స్‌లో బొమ్మనహళ్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఎంఈఓ మల్లికార్జున తెలిపారు. అండర్–19 బాలుర విభాగంలో వంశీకృష్ణ, బాలికల విభాగంలో రేష్మ, అండర్–17 బాలికల విభాగంలో ఎన్.భవాని, అండర్–14 బాలికల విభాగంలో వి.రూప స్టాండ్‌బైగా ఎంపికై నట్టు ఆయన తెలియజేశారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ ఎంఈఓ, హెచ్‌ఎం సుధాకర్, పీఈటీ అశోక్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
తమ్ముడిపై
అన్న గొడ్డలితో దాడి
కణేకల్లు: ఆస్తి వివాదంలో తమ్ముడిపై అన్న గొడ్డలితో దాడికి పాల్పడిన సంఘటన మండలంలోని మాల్యం గ్రామంలో జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలు.. మాల్యం గ్రామానికి చెందిన వడ్డే ఎర్రిస్వామి(48)కి అతడి అన్నకు ఆస్తి విషయమై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. గురువారం ఎర్రిస్వామి గ్రామ సచివాలయానికి వెళ్లి తిరిగి వస్తూ.. మార్గ మధ్యంలోని ఉరవకొండ రోడ్డులోని ఓ పెట్రోల్ బంక్ వద్ద కూర్చున్నారు. అదే సమయంలో అతడి సోదరుడు మరికొందరితో కలిసి గొడ్డలితో తలపై దాడి చేశాడు. గమనించిన స్థానికులు దాడి అడ్డుకొని గాయపడిన ఎర్రిస్వామిని కణేకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తండ్రిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హుండీ ఆదాయం లెక్కింపు
మడకశిరరూరల్: మండలంలోని భక్తరపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయస్వామి ఆలయాల్లో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని గురువారం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో లెక్కించారు. ఆంజనేయస్వామి ఆలయంలో హుండీల ద్వారా రూ.10,59,060లు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రూ.15,30,240లు వచ్చిందని ఈఓ నరసింహరాజు వివరించారు. ఈ మొత్తాన్ని ఆలయాల అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ సిబ్బంది, అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


