పంట పొలాల్లో రక్తపింజరి | - | Sakshi
Sakshi News home page

పంట పొలాల్లో రక్తపింజరి

Oct 2 2026 1:16 AM | Updated on Oct 2 2026 1:16 AM

కళ్యాణదుర్గం రూరల్‌: మండల పరిధిలోని ఎర్రంపల్లి సమీపంలోని పంట పొలాల్లో గురువారం రక్తపింజరి కలకలం రేపింది. వ్యవసాయ పొలాల్లో పనులు చేస్తున్న రైతులకు రక్తపింజరి కనిపించడంతో రైతులు, వ్యవసాయ కూలీలు భయాందోళనకు గురయ్యారు. వారంతా గట్టిగా కేకలు వేయడంతో పాము సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోయింది. అటవీశాఖ అధికారులు స్పందించి రక్తపింజరి, ఎలుగుబంట్ల బారి నుంచి కాపాడాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పలువురు డీఎస్పీల బదిలీ

అనంతపురం సెంట్రల్‌: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసుశాఖ బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఖాళీ ఉన్న డీఎస్పీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అనంతపురం రూరల్‌ డీఎస్పీ స్థానంలో ఏఎస్పీగా ఐఏఎస్‌ అధికారి అశ్విన్‌ మణిదీప్‌ను నియమించిన విషయం విధితమే. తాజాగా వెయిటింగ్‌లో డీఎస్పీలకు పోస్టింగ్‌ ఇచ్చారు. అనంతపురం డీఎస్పీగా పనిచేస్తున్న మాగాల చంద్రశేఖర్‌ను తాడిపత్రి డీఎస్పీగా బదిలీ చేశారు. అనంతపురానికి కరుణాకర్‌రావు, ప్రస్తుతం గుంతకల్లు డీఎస్పీగా పనిచేస్తున్న ఆముదాల శ్రీనివాస్‌ను ఎమ్మిగనూరుకు, వెయిటింగ్‌లో ఉన్న బొల్లినేని శ్రీనివాసరావును గుంతకల్లు డీఎస్పీగా నియమించారు.

ఆరు మండలాల్లో

కరువు లేదంట !

● అనంతలో 28, శ్రీసత్యసాయిలో 29 కరువు మండలాలు

● ప్రభుత్వ ప్రకటనపై పలువురి అసంతృప్తి

అనంతపురం అగ్రికల్చర్‌: నైరుతి రుతుపవనాలు ఏ మాత్రం ప్రభావం చూపకపోవడంతో ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షాలు లేక పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం కరువు మండలాలను ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అనంతపురం జిల్లాలో రాయదుర్గం, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, అనంతపురం అర్బన్‌ మండలాలకు అన్యాయం చేస్తూ 28 మండలాలను కరువు జాబితాలో ప్రకటించింది. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలో అగళి, రొళ్ల, పెనుకొండ మండలాలను పక్కనపెట్టి మిగిలిన 29 మండలాలను కరువు జాబితాలో చేర్చింది. గుమ్మఘట్ట, రొద్దం మండలాలను మధ్యస్తంగానూ మిగిలిన వాటిని తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కరువుంటే ఆరు మండలాలను పక్కన పెట్టడం సరికాదని రైతులు, వివిధ పార్టీల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

‘సర్‌’ పరిశీలన

గడువు పొడిగింపు

● 10వ తేదీ వరకు అవకాశం : కలెక్టర్‌ ఆనంద్‌

అనంతపురం అర్బన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా చేపట్టిన క్లయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలన గడువును ఈనెల 10 తేదీ వరకు ఎన్నికల కమిషన్‌ పొడిగించింది. 16న ఓటర్ల తుదిజాబితా ప్రచురిస్తారు. ఈ విషయాన్ని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్‌ వెల్లడించారు. నోటీసులు అందుకుని విచారణకు హాజరుకాలేకపోయిన ఓటర్ల ఇళ్లకు బీఎల్‌ఓలు స్వయంగా వెళ్లి విచారణ జరపాలని ఆదేశించారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఆన్‌లైన్‌ ద్వారా విచారణ చేయాలని సూచించారు. ఓటరు పేర్కొన్న నివాసంలో సదనే ఓటరు లేనప్పటికీ వారి బంధువులు ఎవరైనా ఉండి సరైన ధ్రువపత్రాలు సమర్పిస్తే స్వీకరించవచ్చన్నారు. విచారణ దశలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు అనర్హులగా గుర్తించి 23,439 మందికి సంబంధించి మరోసారి క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన చేసి అర్హులైన వారిని జాబితాలో చేర్చాలన్నారు. ప్రధాన కూడళ్లు, ప్రత్యేకించి వెనుకబడిన గిరిజన సమూహాల వద్ద ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ఓటరు జాబితా నిరంతర సవరణ ప్రక్రియ సమయంలో ఇప్పటి వరకు పేర్లు నమోదు చేసుకోని ఓటర్లు, తొలిసారి అర్హత సాధించిన వారు కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించేలా ఈఆర్‌ఓలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement