కల్లు బాటిళ్ల ఘటనపై విచారణ | - | Sakshi
Sakshi News home page

కల్లు బాటిళ్ల ఘటనపై విచారణ

Oct 2 2026 1:16 AM | Updated on Oct 2 2026 1:16 AM

● పర్యవేక్షణ లోపంపై డీవైఈఓ ఆగ్రహం

● విద్యారణ్యనగర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం, పీడీకి నోటీసులు

అనంతపురం ఎడ్యుకేషన్‌: అనంతపురం రూరల్‌ మండలం విద్యారణ్యనగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల బ్యాగుల్లో కల్లు బాటిళ్లు, కారంబొరుగుల ప్యాకెట్‌ లభించిన ఘటనపై గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలు విద్యాశాఖలో కలకలం రేపాయి. రాష్ట్ర, జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు, కలెక్టర్‌ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అనంతపురం డివిజన్‌ డీవైఈఓ శ్రీనివాసరావు పాఠశాలకు చేరుకుని సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు, పీడీ వెంకటేశం, విద్యార్థులతో విడివిడిగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు గోడ దూకి పాఠశాల బయటకు వెళ్తున్నా కనీసం పర్యవేక్షించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఎలా చేరాయో ఆరా

ఎస్‌ఎంసీ ఎన్నికలు జరిగిన రోజున కొందరు విద్యార్థుల ప్రవర్తనపై ఉపాధ్యాయులకు అనుమానం రావడంతో వారి బ్యాగులను పరిశీలించగా నాలుగు కల్లు బాటిళ్లు, కారంబొరుగుల ప్యాకెట్లు లభించాయని హెచ్‌ఎం తెలిపారు. విద్యార్థుల వద్దకు అవి ఎలా చేరాయి? ఎవరి ద్వారా వచ్చాయి? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంతటి ఘటన జరిగినా ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇద్దరికి నోటీసులు

విద్యార్థుల వ్యవహారంలో నిర్లక్ష్యానికి బాధ్యత వహించాల్సి రావడంతో ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం లక్ష్మీనారాయణ, పీడీ వెంకటేశంకు డీవైఈఓ నోటీసులు జారీ చేశారు. విచారణ అనంతరం నివేదికను జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు అందజేస్తామని డీవైఈఓ తెలిపారు. తాము తప్పు చేశామని, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని విద్యార్థులు తెలిపినట్లు డీవైఈఓ పేర్కొన్నారు. ఇది సున్నితమైన అంశమని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థులు చెడుదారి పట్టకుండా పూర్తిస్థాయిలో కౌన్సెలింగ్‌ ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలు, వాటికి దూరంగా ఉండాల్సిన అవసరంపై కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement