బైక్‌ ఢీకొని వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ ఢీకొని వృద్ధురాలి మృతి

Oct 2 2026 1:10 AM | Updated on Oct 2 2026 1:10 AM

అనంతపురం సెంట్రల్‌ : జాతీయ రహదారి డీమార్ట్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కక్కలపల్లి గ్రామానికి చెందిన రామలక్ష్మమ్మ(60) మృతి చెందింది. నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిని గార్లదిన్నె మండలం సంజీవపురానికి చెందిన బోయ సాయి అనే యువకుడు పల్సర్‌ బైక్‌తో ఢీ కొట్టాడు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రురాలిని స్థానికులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్టు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

న్యాయమైన

డిమాండ్లను నెరవేర్చాలి

అనంతపురం అర్బన్‌: చంద్రబాబు ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (వీఆర్‌ఏ) జిల్లా అధ్యక్షుడు ఎన్‌.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. డిమాండ్ల సాధనకు సమ్మె బాట పట్టిన వీఆర్‌ఏలు గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ సహాయ నిరాకరణలో భాగంగా రీ–సర్వే విధులకు హాజరుకామని తెలిపారు. వీఆర్‌ఏలకు తెలంగాణ తరహాలో ఇక్కడా పేస్కేల్‌ అమలు, అర్హులకు పదోన్నతి, వీఆర్‌ఏల వేతనాన్ని 70 శాతానికి పెంచడంతోపాటు నామినీలుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్‌ చేయాలని కోరారు. మరణించిన వీఆర్‌ఏల కుటుంబాల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు, కార్యదర్శులు చిరంజీవి, పరమేశప్ప, బాలకృష్ణ, నాగేంద్ర, కోశాధికారి నారాయణస్వామి, సుంకన్న, తదితరులు పాల్గొన్నారు.

ఉన్నత లక్ష్యంతో చదవాలి

కళ్యాణదుర్గం రూరల్‌: పాఠశాల దశ నుంచే ఉన్నతమైన లక్ష్యంతో చదవాలని డీఈఓ అయ్యూబ్‌ హుస్సేన్‌ విద్యార్థులకు సూచించారు. గురువారం పట్టణంలోని కరణం చిక్కప్ప, గర్ల హైస్కూల్‌లో ఆయన పర్యటించారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ భవిష్యత్తు ప్రణాళికలను పాఠశాల దశలో నిర్ణయించుకొని, దానిని సాధించేందుకు శ్రమించాలని చెప్పారు. విద్యార్థులకు క్రమశిక్షణ తప్పనిసరని, లక్ష్యాల సాధనకు ఉపాధ్యాయుల సూచనలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి దేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాంను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంటశాలలో పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ విజయకుమారి, బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement