గుమ్మఘట్ట: రాయదుర్గం మండలంలోని టీ.వీరాపురం గ్రామ సమీపంలో వెలసిన దొణ గంగమ్మ జాతర సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. జాతరకు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంలో కొలువుదీర్చి పురవీధులలో మేళతాళాల నడుమ ఊరేగింపుగా దొణవద్దకు చేర్చారు. తిరిగి సాయంత్రం రథాన్ని ఆలయం వద్దకు లాగారు. అంతకుమునుపు మహిళలు భక్తిశ్రద్ధలతో దొణవద్దకు చేరుకుని గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు కాంట్రాక్టర్ నేత్రపల్లి ఆర్‌టీ లక్ష్మీకాంతారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మల్లికార్జున, మాజీ సర్పంచ్ ఓబుళమ్మ, మాజీ ఎంపీటీసీ రాజమ్మ, మెట్టు ధనుంజయరెడ్డి, గొల్ల రామాంజినేయులు, తిమ్మారెడ్డి, అనుమేష్, రామన్నయాదవ్ లక్ష్మీరెడ్డి, చిత్రయ్య, మహేష్, అశోక్, ప్రకాష్, దుబాయ్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.


