హామీ మరచిన ‘అమిలినేని’ | - | Sakshi
Sakshi News home page

హామీ మరచిన ‘అమిలినేని’

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

కళ్యాణదుర్గం : తనను గెలిపిస్తే కళ్యాణదుర్గ ప్రాంత ప్రజల చిరకాల కల బీటీపీ కాలువ తవ్వకం పనులను పూర్తి చేస్తానని, లాభాపేక్ష లేకుండా, అవసరమైతే తన సొంత డబ్బు ఖర్చు పెట్టడానికై నా వెనకాడబోనని అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. రెండేళ్లు దాటినా ఆశించినస్థాయిలో పనులు జరగడం లేదు. తమను మభ్యపెట్టడానికే అలవికాని హామీలిచ్చారని ప్రజలు, ప్రజాసంఘాలు, విపక్ష పార్టీల నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.

ప్రాజెక్టుకు రూపకల్పన ఇలా..

బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి రాయదుర్గం నియోజకవర్గంలోని భైరవానితిప్ప ప్రాజెక్టు(బీటీపీ)కు కృష్ణా జలాలను తరలిచేందుకు ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి 3.7 టీఎంసీల నీటిని తరలించేందుకు వీలుగా 93 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణం, 8 లిఫ్ట్‌లు, 8 సబ్‌ స్టేషన్ల నిర్మాణం చేపట్టాలి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువుల్లో నీరు నింపడానికి 1.7 టీఎంసీలు, బీటీ ప్రాజెక్టుకు 2 టీఎంసీలను తరలించి ఆ ప్రాంత రైతులకు తాగు, సాగు నీటి కష్టాలు తీర్చడమే ప్రాజెక్టు లక్ష్యం. కాలువ తవ్వకం కోసం 1462.37 ఎకరాల భూమి కావాలని ప్రతిపాదించారు. భూ సేకరణకు రూ.208.85 కోట్ల నిధులు అవసరం. 2018లో ప్రాజెక్టు పనులను అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ పనుల కాంట్రాక్ట్‌ ప్రస్తుత కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్‌ఆర్‌సీ సంస్థ దక్కించుకుంది. అప్పట్లో రూ.30 కోట్ల వరకు మాత్రమే నిధులు ఖర్చు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాలువ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు రూ.80కోట్ల పరిహారం పంపిణీ చేసింది. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో పనులు ఆగిపోయాయి.

హడావుడి తవ్వకాలు..

2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో అమిలినేని ఇచ్చిన హామీ మేరకు 2027 ప్రారంభానికల్లా బీటీపీ కాలువ తవ్వకం పనులు పూర్తి కావాలి. అయితే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కాలువ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు చూపించేందుకు ఎమ్మెల్యే అమిలినేని హడావుడి చేశారు. ఈ క్రమంలోనే కళ్యాణదుర్గం – అనంతపురం ప్రధాన రహదారిలో ఒంటిమిద్ది వద్ద, కళ్యాణదుర్గం– ఉరవకొండ ప్రధాన రహదారిలో బోరంపల్లి వద్ద, కళ్యాణదుర్గం– కంబదూరు ప్రధాన రహదారిలో నారాయణపురం వద్ద, కళ్యాణదుర్గం – శెట్టూరు ప్రధాన రహదారిలో ఉప్పవంక దాటిన తర్వాత అలా పనులు చేపట్టి.. ఇలా ఆపేశారు. సొంత డబ్బు ఖర్చు పెట్టి కాలువలు తవ్వుతామని, రెండున్నరేళ్లకే పనులు పూర్తి చేస్తామని చేసిన ప్రకటనలు ఉత్తివేనని తేలిపోయింది. 2028 మార్చి నాటికి బీటీపీ పనులు పూర్తి చేస్తానని తాజాగా హామీ ఇవ్వడం గమనార్హం.

రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో వెనుకబడిన ప్రాంతాల సాగు–తాగునీటి

అవసరాలు తీర్చడం కోసం ఉద్దేశించిన

బీటీపీ కాలువ తవ్వకం పనులు ముందుకు సాగడం లేదు. రెండున్నరేళ్లలో కాలువ తవ్వకం పనులు పూర్తి చేస్తానని ఎన్నికలకు ముందు, ఆ తర్వాత అమిలినేని సురేంద్రబాబు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. కాలువ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఈ ఏడాది ఆగస్టులోగా పరిహారం

చెల్లిస్తామని చెప్పినా.. ఇప్పటి వరకు ఎవ్వరికీ అందలేదు. హామీలు అమలు చేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని

ప్రకటించిన అమిలినేని సురేంద్రబాబు.. తర్వాత కాలువ పనుల పూర్తి డెడ్‌లైన్‌ను పొడిగించడం విమర్శలకు తావిస్తోంది.

ముందుకు సాగని

బీటీపీ కాలువ తవ్వకం పనులు

రెండున్నరేళ్లలో పూర్తిచేయకపోతే

రాజీనామా చేస్తానన్న అమిలినేని

నిర్వాసిత రైతులకు గడువు దాటినా

అందని పరిహారం

ఆర్భాటాలు తప్ప..

ఆచరణలో కనిపించని పురోగతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement