గుంతకల్లు: సహజ వనరులను ‘పచ్చ’ నేతలు ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అండతో చెలరేగిపోతున్నారు. గుంతకల్లు మండలలోని పలుచోట్ల మట్టి అక్రమ తవ్వకం, అమ్మకం జోరుగా సాగుతోంది. పట్టణ శివారులోని నెల్లూరు– అంకోలా జాతీయ రహదారిలోని పవర్ గ్రిడ్ సమీపాన సర్వే నం.191,193లో గల కొండ గుట్టను కొల్లగొడుతున్నారు. కసాపురం పంచాయతీలోని మండేకుల కొట్టాల సమీపంలోని సర్వే నంబర్ 426లో గల గుట్టతో పాటు వైటీ చెరువులో నిరంతరాయంగా జేసీబీతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే పక్కన ఉండే టీడీపీ సీనియర్ నేత అండదండలతో గుట్టలో తవ్విన మట్టిని రైల్వే పనులకు వాడుతున్నారు. పవర్ గ్రిడ్ సమీపంలో గుట్టను గుమ్మనూరు ఈశ్వర్ ప్రధాన అనుచరులైన ఇద్దరు కొల్లగొట్టి.. మట్టిని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. టిప్పర్ మట్టి ధర రూ.7వేల నుంచి రూ.8 వేల వరకు విక్రయిస్తున్నారు. వైటీ చెరువులోని మట్టిని సైతం ట్రాక్టర్ల ద్వారా తరలించారు. ఇలా ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు చేపట్టి నెలానెలా రూ.కోట్లు గడిస్తూ.. ప్రభుత్వ ఆదాయనికి గండి కొడుతున్నారు. అయినా మైనింగ్, రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
మా దృష్టికి రాలేదు..
గుంతకల్లు మండలలో జరుగుతున్న మట్టి దందాపై తహసీల్దార్ రమాదేవిని వివరణ కోసం ‘సాక్షి’ ఫోన్ ద్వారా సంప్రదించగా ఆమె స్పందించలేదు. దీంతో పవర్ గ్రిడ్ సమీపంలో జరిగే అక్రమ తవ్వకాలపై సంబంధిత వీఆర్‌ఓ కృష్ణను సంప్రదించగా అక్కడ గుట్టను తవ్వి.. మట్టి తరలిస్తున్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు.
‘గుమ్మనూరు’ అండతో మట్టిని తవ్వేస్తున్న టీడీపీ నాయకులు


