నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’ | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

అనంతపురం అర్బన్‌: ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు తెలియజేయాలని సూచించారు. భూ సమస్యలకు సంబంధించిన అర్జీలను కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో అధికారులకు అందజేయాలని తెలిపారు.

‘స్థానిక’ ఎన్నికలకు

సిద్ధం చేయండి

అనంతపురం న్యూటౌన్‌: స్థానిక సంస్థలకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అందుకు క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్‌ అండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్‌ సుధాకర్‌రావు ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా ప్రజా పరిషత్‌, డీడీఓలు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు తదితరులతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే గ్రామాలను గుర్తించి, ఎంపీపీల సరిహద్దుల మేరకు మ్యాపింగ్‌ చేయాలని సూచించారు. అలాగే 2026 జనవరి ఒకటవ తేదీ నాటికి ప్రచురించిన ఓటర్ల జాబితాలను ఆన్‌లైన్‌ చేయడంతో పాటు మూడు సెట్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి స్టేజ్‌–1, స్టేజ్‌–2 ఎన్నికల అధికారుల జాబితాలతో జిల్లా, మండల, గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచాలని స్పష్టంచేశారు.

వర్షాకాలంలో వేసవితాపం

అనంతపురం అగ్రికల్చర్‌: వర్షాకాలమైనా జిల్లాలో వాతావరణ పరిస్థితులు విచిత్రంగా మారుతున్నాయి. నాలుగు రోజులుగా వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా మండలాల్లో 38 డిగ్రీలు రికార్డు కాగా... ఉక్కపోత కూడా అధికంగా నెలకొంది. ఉదయం 10 గంటల సమయానికే ఎండలు దంచికొడుతున్నాయి. ఉన్నపళంగా మేఘాలు కమ్ముకోవడం, బలమైన గాలులు వీయడం, వర్షం వచ్చేలా కనిపించినా చివరకు తేలికపాటి కూడా నమోదు కాని పరిస్థితులు నెలకొన్నాయి. సూపర్‌ ఎల్‌–నినో ప్రభావంతో జూన్‌ నుంచి ఇప్పటి వరకు రోజురోజుకూ భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సమృద్ధిగా వర్షాలు పడాల్సిన సమయంలో వరుణుడి జాడే కరువైపోయింది. నాలుగు రోజులుగా గాలివేగం కొద్దిగా తగ్గింది. ఉక్కపోత, ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి.

కరెంటు కోతలపై ఆగ్రహం

డి.హీరేహాళ్‌(బొమ్మనహాళ్‌): లోడ్‌ రిలీఫ్‌ పేరుతో కరెంట్‌ కట్‌ చేయడంపై రైతులు ఆగ్రహించారు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో డి.హీరేహాళ్‌ మండలం బాదనహాల్‌, దొడగట్ట గ్రామాల రైతులు గొడిసెలపల్లి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ముట్టడించారు. కరెంటు కట్‌ చేయడంతో మోటర్లు ఆడక పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. నిర్దేశిత తొమ్మిది గంటల్లో నాలుగు గంటలు మాత్రమే సరఫరా ఇచ్చి.. మిగిలిన గంటలు లోడ్‌ రిలీఫ్‌ పేరుతో కరెంటు సరఫరా ఆపితే ఎలా అని మండిపడ్డారు. అధికారులు స్పందించి విద్యుత్‌ సక్రమంగా ఇచ్చి పంటలు కాపాడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement