గుంతకల్లు: పట్టపగలే ఓ మహిళా మెడలోని 2.5 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన కసాపురంలో చోటు చేసుకుంది. బాధితురాలి వివరాలమేరకు.. కంబదూరుకు చెందిన వడ్డే ఽశివశంకర్, గంగమ్మ దంపతులు ఆదివారం కసాపురం క్షేత్రంలో సమీప బంధువుల కేశఖండన కార్యక్రమానికి వచ్చారు. మధ్యాహ్నం భోజన తర్వాత ఎండ ఎక్కువగా ఉండటంతో కూల్ డ్రింక్ తాగాలని నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వద్ద ఉన్న షాపునకు గంగమ్మ వచ్చింది. అయితే అప్పటికే ఆమైపె నిఘా పెట్టిన దొంగ కూడా కూల్‌డ్రింక్ కోనుగోలు చేశాడు. గంగమ్మ కూల్‌డ్రింగ్ తాగుతుండగా ఆమె మెడలోని బంగాచు చైన్ లాక్కొని కొంతదూరంలో ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉన్న మరో దొంగతో కలిసి ఉడాయించాడు. ఘటనపై భర్త శివశంకర్‌తో కలిసి గంగమ్మ కసాపురం పోలీసుస్టేషన్ ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వెంకటస్వామి కేసు దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
కళ్యాణదుర్గం రూరల్: మండల పరిఽధిలోని బోరంపల్లి వద్ద కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో కంబదూరు మండలం వెంకటంపల్లికి చెందిన హనుమంతురెడ్డి(42) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు... కంబదూరు మండలానికి చెందిన హనుమంతురెడ్డికి కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన ప్రవీణతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి కళ్యాణదుర్గంలో నివాసం ఉంటూ ట్రాక్టర్ షోరూంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం హనుమంతురెడ్డి బోరంపల్లికి తన ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. బోరంపల్లి సమీపంలోకి రాగానే వేగంగా అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వైపు వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ప్రమాదంలో హనుమంతురెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య ప్రవీణ, ఇంటర్ చదువుతున్న కుమారుడు చరణ్ ఉన్నారు. మాకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
చికిత్స పొందుతూ విద్యార్థి..
రాయదుర్గం రూరల్: మండలంలోని కాశీపురం గేటు వద్ద బొలెరో వాహనం, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఘటనలో బెళుగుప్ప మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన ముగ్గురు పదో తరగతి విద్యార్థులు శనివారం తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రామ్‌చరణ్ అనే విద్యార్థి శనివారం రాత్రి మృతి చెందాడు. అర్బన్ సీఐ దేవానంద్ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. మరో ఇద్దరు విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ తెలిపారు.
కల్వర్టు పై నుంచి పడి కూలీ..
యాడికి: కల్వర్టుపై నుంచి పడటంతో కూలీ మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి మండలంలోని పెద్దపేట–యాడికి రహదారిలోని ఆదినారాయణరెడ్డి కోళ్ల ఫారం వద్ద చోటు చేసుకుంది. పోలీసుల వివరాలమేరకు... కర్నూల్ జిల్లా వెల్దుర్తి మండలానికి చెందిన పెద్ద కుళ్లాయప్ప (45), లక్ష్మిదేవి దంపతులు 20 ఏళ్ల క్రితం యాడికి మండలానికి వచ్చారు. ఆదినారాయణరెడ్డి కోళ్ల ఫారంలో దినసరి కూలీలుగా పని చేస్తూ అక్కడే ఉన్న రూమ్‌లలో నివసిస్తున్నారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. శనివారం రాత్రి భోజనం తిన్న తర్వాత పెద్ద కుళ్లాయప్ప కోళ్ల ఫారం బయట రోడ్డుపై ఉన్న బ్రిడ్జి వద్ద గల కల్వర్టుపై కూర్చున్నాడు. అయితే ప్రమాదవశాత్తూ కల్వర్టుపై నుంచి కుళ్లాయప్ప కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం తెల్లవారు జామున భర్త కుళ్లాయప్ప కనిపించడంలేదని లక్ష్మిదేవి తన కుమారుడికి చెప్పటంతో కల్వర్టు, పరిసర ప్రాంతాల్లో చూడగా కుళ్లాయప్ప కల్వర్టు కింద పడిఉండటాన్ని గమనించారు. వెంటనే పెద్ద కుళ్లాయప్పను ఓ వాహనంలో తాడిపత్రిలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
జేఎన్‌టీయూ అనంతపురంలో
ప్రత్యేక హెల్ప్ డెస్క్
అనంతపురం: జర్మనీలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు జేఎన్‌టీయూ అనంతపురంలో ఈ నెల 7, 8 తేదీల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వీసీ హెచ్. సుదర్శనరావు తెలిపారు. నేరుగా జర్మన్ వర్సిటీ ప్రతినిధులతో మాట్లాడే అవకాశం కల్పించామన్నారు. జర్మన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులు విద్యార్థులకు అందుబాటులో ఉండి, ప్రోగ్రామ్‌కు సంబంధించిన వివిధ అంశాలపై నేరుగా అవగాహన కల్పిస్తారన్నారు. ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్‌లర్ , మాస్టర్ ప్రోగ్రామ్ (ఐఐబీఎంపీ) ప్రవేశాలకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 90441 15999, 90441 17999ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.


