గొర్రెపిల్లల దొంగల ఆటకట్టు! | - | Sakshi
Sakshi News home page

గొర్రెపిల్లల దొంగల ఆటకట్టు!

Sep 6 2026 12:43 AM | Updated on Sep 6 2026 12:43 AM

రాప్తాడు రూరల్‌: రాప్తాడు మండలం లింగనపల్లిలో వరుసగా చోటుచేసుకున్న దొంగతనాలకు ఎట్టకేలకు పోలీసులు చెక్‌ పెట్టారు. గొర్రెపిల్లల దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను రాప్తాడు సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

గొర్రెపిల్లల దొంగతనంతో వెలుగులోకి..

అనంతపురం రూరల్‌ మండలం రుద్రంపేట పంచాయతీ చంద్రబాబునగర్‌కు చెందిన సాయి, చిన్న అలియాస్‌ రవికుమార్‌రెడ్డి జల్సాలకు అలవాటుపడి చిన్నచిన్న దొంగతనాలు చేసేవారని సీఐ తెలిపారు. బైకు లేదా కారులో వచ్చి ఒకట్రెండు గొర్రెపిల్లలను ఎత్తుకెళ్లి విక్రయించేవారన్నారు. ఇటీవల లింగనపల్లిలో పది గొర్రెపిల్లలను కారులో ఎత్తుకెళ్తుండగా గ్రామస్తులు అడ్డగించారని, వారిని కత్తి, రాడ్డుతో బెదిరించి పరారయ్యారని వివరించారు. గ్రామస్తులపైకి కారును దూసుకెళ్లే ప్రయత్నం చేసి భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. ఆ సమయంలో గ్రామస్తులు కారును ఫొటో తీయడంతో దర్యాప్తులో కీలక ఆధారం లభించిందని సీఐ పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నామని తెలిపారు. సాయిపై గతంలోనూ పలు దొంగతనాల కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

బైకుపై ‘పోలీసు’..

అడ్డొచ్చిన వారికి బెదిరింపులు

పేరూరు గ్రామానికి చెందిన ధన అలియాస్‌ ధనుంజయ అనే వ్యక్తి బైకుపై ‘పోలీసు’ అని రాసుకుని తిరిగేవాడని సీఐ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఒంటరిగా ఉన్నవారిని, మద్యం సేవించే వారిని గుర్తించి పోలీసునంటూ బెదిరించి డబ్బులు దండుకునేవాడన్నారు. రవికుమార్‌రెడ్డితో కలిసి బైకుపై వెళ్లి గొర్రెపిల్లలను ఎత్తుకెళ్లేవాడని, ఎవరైనా ఎదురైతే కత్తితో బెదిరించడం, దాడి చేయడం వంటివి చేసేవారని వివరించారు. ధనుంజయ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు.

రైల్వే గ్యాంగ్‌మ్యాన్‌

అనుమానాస్పద మృతి

అనంతపురం సెంట్రల్‌: నగరంలో శ్రీనివాసనగర్‌లో రైల్వే గ్యాంగ్‌మ్యాన్‌ వెంకటేష్‌(45) అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. త్రీటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రైల్వేలో గ్యాంగ్‌మ్యాన్‌గా పనిచేస్తున్న వెంకటేష్‌ ఇటీవల తాగుడుకు బానిసయ్యాడు. గ్యాంగ్‌మెన్‌ ఉద్యోగానికి కూడా దూరంగా ఉంటున్నాడు. భార్యాపిల్లలు అతనికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వెంకటేష్‌ శనివారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో కనిపించాడు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య అనూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ కౌలుట్లయ్య వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement