అనంతపురం క్రైం: ఉమ్మడి అనంతపురం జిల్లా పునర్విభజన జరిగి నాలుగేళ్లు గడిచినా.. పట్టణాభివృద్ధి పరంగా మాత్రం రెండు జిల్లాల మధ్య సంబంధం పూర్తిగా తెగిపోలేదు. అనంతపురం–హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థగా కొనసాగిన అహుడా పరిధి ఏళ్ల తరబడి రెండు జిల్లాల భౌగోళిక ప్రాంతాలను కలుపుతూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ఆ వ్యవస్థకు తెరపడింది. అహుడా పేరును ‘అనంతపురం పట్టణాభివృద్ధి సంస్థ’గా (ఏటీపీ యూడీఏ) మార్చి.. శ్రీసత్యసాయి జిల్లా పరిధిని పూర్తిగా బయటకు తీసింది. అదే సమయంలో పుట్టపర్తి పట్టణాభివృద్ధి సంస్థ (పీయూడీఏ) పరిధిని శ్రీసత్యసాయి జిల్లాలో విస్తరించింది. ఇప్పటికే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి.
విస్తీర్ణంలో ‘అనంత’ ముందంజ
కొత్త ఏటీపీ యూడీఏలో అనంతపురం నగరంతో పాటు రాయదుర్గం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు పట్టణాలు ఉన్నాయి. అనంతపురం, ఆత్మకూరు, బెలుగుప్ప, బొమ్మనహాళ్, బ్రహ్మసముద్రం, బుక్కరాయసముద్రం, డి.హీరేహాళ్, గార్లదిన్నె, గుత్తి, గుమ్మగట్ట, గుంతకల్లు, కళ్యాణదుర్గం, కంబదూరు, కనేణేల్లు, కూడేరు, కుందుర్పి, నార్పల, పామిడి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, పుట్లూరు, రాప్తాడు, రాయదుర్గం, శెట్టూరు, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు, యాడికి, యల్లనూరు మండలాలున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల్లో మొత్తం విస్తీర్ణాన్ని 10,205 చ.కి.మీ.గా పేర్కొన్నారు. అంటే అనంతపురం యూడీఏ కేవలం అనంతపురం నగర చుట్టుపక్కల అభివృద్ధి సంస్థ కాదు. తాడిపత్రి–యాడికి పారిశ్రామిక అక్షం, గుత్తి–గుంతకల్లు రవాణ అక్షం, అనంతపురం–రాప్తాడు పట్టణ విస్తరణ, ఉరవకొండ–వజ్రకరూరు ప్రాంతాల భవిష్యత్ అభివృద్ధి ఒకే ప్రణాళికా వ్యవస్థలోకి వచ్చాయి.
‘శ్రీసత్యసాయి’కి పెట్టుబడే బలం
పీయూడీఏలో ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి వంటి పట్టణాలు ఉన్నాయి. మొత్తం 32 మండలాలు, 8,925 చ.కి.మీ. పరిధిలో పీయూడీఏను పునర్వ్యవస్థీకరించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ పారిశ్రామిక గణాంకాల ప్రకారం ఉమ్మడి అనంతపురం–శ్రీసత్యసాయి ప్రాంతంలో నమోదైన భారీ, మెగా పరిశ్రమలు 68. అందులో శ్రీసత్యసాయి జిల్లాలోనే 47, అనంతపురం జిల్లాలో 21 ఉన్నాయి. అంటే భారీ పరిశ్రమల సంఖ్యలో శ్రీసత్యసాయి జిల్లా వాటా దాదాపు 69 శాతం. పెట్టుబడుల విషయానికి వస్తే మొత్తం భారీ, మెగా పరిశ్రమల పెట్టుబడి సుమారు రూ.21,751.68 కోట్లు. అందులో శ్రీసత్యసాయి జిల్లాలో రూ.16,430.50 కోట్లు, అనంతపురం జిల్లాలో రూ.5,321.16 కోట్లు ఉన్నాయి. అంటే పెట్టుబడుల్లో శ్రీసత్యసాయి వాటా సుమారు 75.5 శాతం. ఉద్యోగాల పరంగానూ శ్రీసత్యసాయి జిల్లాలో 25,672, అనంతపురం జిల్లాలో 7,492 ఉద్యోగాలు నమోదయ్యాయి. అంటే విస్తీర్ణం అనంతపురం వైపు ఎక్కువగా ఉన్నా.. భారీ పరిశ్రమల ఆర్థిక బలం సత్యసాయి వైపు గట్టిగా కేంద్రీకృతమై ఉంది.
పరిశ్రమల కేంద్రాల లెక్క ఇలా..
పారిశ్రామిక వివరాల ప్రకారం అనంతపురం వైపు అనంతపురం, గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి, సజ్జలదిన్నె, సద్లపల్లి, తిమ్మసముద్రం వంటి పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. శ్రీసత్యసాయి వైపు అమ్మవారిపల్లి, గుడిపల్లి, హిందూపురం, గొల్లాపురం, కదిరి, అమడగూరు, పెనుకొండ ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాంతాలున్నాయి. రాప్తాడు, కొటిపి, కప్పలబండ వంటి ప్రాంతాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్ధి కూడా నమోదైంది.
ఎంఎస్‌ఎంఈల్లో సీన్ రివర్స్
చిన్న, మధ్యతరహా పరిశ్రమల దగ్గర లెక్కలు పూర్తిగా మారిపోయాయి. రెండు జిల్లాల్లో కలిపి నమోదైన ఎంఎస్‌ఎంఈలు 7,040. ఇందులో అనంతపురం జిల్లాలో 4,180, శ్రీసత్యసాయి జిల్లాలో 2,860 ఉన్నాయి. అంటే సంఖ్య పరంగా దాదాపు 59.4 శాతం అనంతపురం వాటా ఉంది. ఎంఎస్‌ఎంఈ పెట్టుబడుల్లోనూ మొత్తం రూ.2,28,673.6 కోట్లు నమోదై ఉండగా.. అనంతపురం వాటా రూ.98,815.1 కోట్లు, శ్రీసత్యసాయి వాటా రూ.1,29,859 కోట్లు. ఉద్యోగాల్లో మాత్రం అనంతపురంలో 31,754, శ్రీసత్యసాయిలో 33,245 ఉన్నాయి.
అహుడా స్థానంలో ఉమ్మడి అనంతకు రెండు పట్టణాభివృద్ధి సంస్థలు
పరిశ్రమల పెట్టుబడుల్లో ‘శ్రీసత్యసాయి’ దూకుడు..
ఎంఎస్‌ఎంఈల సంఖ్యలో ‘అనంత’ ముందంజ


