12న జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

12న జాతీయ లోక్‌ అదాలత్‌

Sep 4 2026 2:18 AM | Updated on Sep 4 2026 2:18 AM

అనంతపురం న్యూటౌన్‌: ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఈ నెల 12వ తేదీన జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు తెలిపారు. అనంతపురంలోని న్యాయ సేవా సదన్‌, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థలో గురువారం ఆయన రెండు జిల్లాల ఎస్పీలు జగదీష్‌, సతీష్‌కుమార్‌తో సబీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ లోక్‌ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులను రాజీ చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి సత్యవాణి, న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎన్‌.రాజశేఖర్‌, శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ శైలజదేవి పాల్గొన్నారు.

583 ఫోన్లు రికవరీ

అనంతపురం సెంట్రల్‌: ‘మీ మొబైల్‌– మీ ఇంటికి’ కార్యక్రమం ద్వారా గురువారం జిల్లా వ్యాప్తంగా సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి రికవరీ చేసిన ఫోన్లను పోలీసులు అందజేశారు. 583 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ జగదీష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకూ రూ.1.22 కోట్లు విలువజేసే 583 ఫోన్లను అందజేసినట్లు పేర్కొన్నారు.

ముగిసిన జిల్లా స్థాయి క్రీడాపోటీలు

అనంతపురం: ఆర్డీటీ క్రీడా మైదానంలో రెండు రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి స్కూల్‌ స్పోర్ట్స్‌ చాంపియన్‌ షిప్‌–2026 క్రీడా పోటీలు గురువారం ముగిశాయి. కబడ్డీలో కూడేరు కేజీబీవీ ప్రథమ స్థానంలో నిలవగా, తాడిపత్రిలోని సాయి చైతన్య స్కూల్‌ రన్నరప్‌ దక్కించుకుంది. అలాగే వాలీబాల్‌లో విన్నర్స్‌గా బ్రహ్మసముద్రంలోని ఏపీఆర్‌ఎస్‌, రన్నర్స్‌గా నార్పల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఫుట్‌బాల్‌ విన్నర్స్‌గా కళ్యాణదుర్గం, రన్నర్స్‌గా గుంతకల్లు జట్టు నిలిచాయి. బాస్కెట్‌బాల్‌ విన్నర్స్‌గా నార్పల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, రన్నర్స్‌గా బసాపురం జెడ్పీహెచ్‌ఎస్‌, హాకీ విన్నర్స్‌గా దురదకుంట జెడ్పీహెచ్‌ఎస్‌, రన్నర్స్‌గా గడేకల్లు జెడ్పీహెచ్‌ఎస్‌ నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలను అభినందిస్తూ ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ సాయి, డీఎస్‌డీఓ ఎస్‌ఎం మంజుల, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శులు శ్రీనివాసులు, శకుంతల, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్‌.నాగరాజు, కార్యదర్శి సిరాజుద్దీన్‌, పీఈటీలు, డీఎస్‌ఏ కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

మట్కా బీటర్ల అరెస్ట్‌

తాడిపత్రిటౌన్‌: పట్టణంలో పలు ప్రాంతాల్లో మట్కా రాస్తున్న మట్కా బీటర్‌లను గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళ ఉన్నారు. వారి వద్ద నుంచి రూ 1,10,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సెల్‌ఫోన్‌, మట్కా చీటీలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఆరోహణరావు తెలిపారు. పట్టణంలో ఎక్కడైనా మట్కా నిర్వహిస్తుంటే ప్రజలు తమకు సమాచారాం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.

అలరించిన సంగీత కచేరీ

ప్రశాంతి నిలయం: పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన విశాఖ జిల్లా సత్యసాయి భక్తులు సత్యసాయిని కీర్తిస్తూ నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. గురువారం విశాఖటప్నం జిల్లాకు చెందిన సత్యసాయి భక్తులు ‘మానస సంచరే’ పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ సుమారు గంట పాటు కచేరీ నిర్వహించారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement