● ఉద్యోగులను ప్రభుత్వ వ్యతిరేకులుగా చూపుతారా?
● చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నేతల ఆగ్రహం
అనంతపురం అర్బన్: ‘ఉద్యోగుల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ఆర్థిక ప్రయోజనాలు అందించే విషయంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ప్రభుత్వ వ్యతిరేకులుగా చూపే ప్రయత్నం బాధాకరం. కాబట్టి హక్కుల సాధనకు సమష్టిగా ఉద్యమిద్దాం’ అని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ ఆర్.ఎన్.దివాకర్‌రావు పిలుపునిచ్చారు. ఉద్యమంలోకి వెళ్లాల్సిన కారణాలను వివరించేందుకు ‘ఉద్యోగితో చేయి చేయి కల్పి’ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా పరిషత్, కలెక్టరేట్, వైద్యారోగ్యశాఖ, తదితర కార్యాలయాల వద్ద ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ ఉద్యోగులు తమకు రావాల్సిన హక్కుల గురించి అడుగుతుంటే... రాష్ట్ర ఆదాయంలో 94 శాతం ఉద్యోగులు, పెన్షనీర్ల వేతనాలకే ఖర్చు చేయాల్సి వస్తోందంటూ తప్పుడు లెక్కలు చూపించడం దారుణమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హక్కులను సాధించుకునేందుకు ఉద్యమం తప్ప మరోమార్గం లేదన్నారు. ప్రతి ఉద్యోగి ఉద్యమంలో భాగస్వాములవ్వాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శి పీఎస్‌ఖాన్, మహిళ విభాగం చైర్‌పర్సన్ సురేఖరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటశివప్రసాద్, కోశాధికారి సంతోష్, సిటీ చైర్మన్ పునీత్‌బాబు, వీఆర్‌ఏ సంఘం అధ్యక్షుడు ఓబుళేసు, నాయకులు అబ్దుల్, రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యలు పట్టవా?
‘‘ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనీర్ల ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరిస్తే మరో మహోద్యమం తప్పదు. సమస్యలపై ప్రభుత్వానికి రాష్ట్ర నాయకత్వం రెండున్నర ఏళ్ల పాటు ఓపిగ్గా విజ్ఞప్తులు చేసింది. చర్చలు జరిపింది. అయితే అటు కనీస స్పందన లేదు. ఈ పరిస్థితుల్లో పోరాటం ద్వారానే హక్కులను సాధించుకోవాలి. కాబట్టి ప్రతి ఉద్యోగి ఉద్యమానికి సిద్ధమవ్వాలి.’’ అని ఉద్యోగులకు ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ జక్కుల మాధవ్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సంఘం కార్యాలయంలో జేఏసీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే పీఆర్‌సీ కమిషన్ నియమిస్తామని, ఐఆర్ ప్రకటిస్తామని, పెండింగ్ లేకుండా డీఏలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ప్రభుత్వం ఈరెండున్నర ఏళ్లలో ఉద్యోగులను పూర్తిగా విస్మరించిదన్నారు. ఇప్పటి వరకు విజ్ఞప్తులు చేసిన చేతులు ఇప్పుడు పిడికిలి బిగించి ఉద్యమబాట పట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, నాయకులు రవికుమార్, వెంకటేష్‌బాబు, ప్రతాప్, నారాయణ, శ్రీనివాసరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, గౌస్‌పీరా, నరేష్, వెంకటరత్నం, మహేశ్వరెడ్డి, వంశీ, జమీల, తిమ్మప్ప, రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జేఏసీ అమరావతి చైర్మన్ దివాకర్‌రావు, మాట్లాడుతున్న ఏపీ జేఏసీ చైర్మన్ మాధవ్


