● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి
ఉరవకొండ: జిల్లాలో వ్యవసాయ సంక్షోభం నెలకొందని, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కరువు పరిస్థితులు ఉన్నాయని, అయినా కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఖరీఫ్‌లో అనంతపురం జిల్లాలో 55 శాతం, శ్రీసత్యసాయి జిల్లాలో 48 శాతం మాత్రమే పంటలు సాగయ్యాయన్నారు. భూగర్భజలాలు అడుగంటి తాగు, సాగునీటికే కాకుండా పశుగ్రాసం కొరత తీవ్రంగా వేధిస్తోందన్నారు. అలాగే రాయలసీమలో 75 శాతం పాల ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు. శ్రీశైలంలో నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 874.30 అడుగులు ఉన్నాయన్నారు. ఇలాంటి తరుణంలో ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారన్నారు. శ్రీశైలానికి ఇన్‌ఫ్లో 13,171 క్యూసెక్కులు ఉంటే విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ ఔట్‌ఫ్లో 26,114 క్యూసెక్కులుగా వెళ్తోందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రెండు వారాల్లో డ్యాం నీటి మట్టం 854 అడుగులకు పడిపోతుందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పొతిరెడ్డిపాడు నుంచి నీళ్లు వచ్చే అవకాశం ఉండదన్నారు. తుంగభద్రడ్యాం పరిధిలోని హెచ్చెల్సీ, జీబీసీ పరిధిలో కేవలం రెండు నియోజకవర్గాలకే ఆరుతడి పంటలకు నీళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. పంటలు పెట్టుకున్న మిగిలిన నియోజకవర్గాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాతావరణం అనుకూలించని నేపథ్యంలో రైతులకు బీమా పరిహరం, ఇన్‌పుట్ సబ్సీడీ అందించాలని డిమాండ్ చేశారు.
గడ్డి తింటూ కార్మికుల
వినూత్న నిరసన
కూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్ డ్యాం వద్ద ఉన్న సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్ ముందు ఆ పథకంలో పని చేస్తున్న కార్మికులు డిమాండ్ల సాధన కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఽనిరవధిక సమ్మె గురువారం మూడో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగానే కార్మికులు పచ్చి గడ్డి తింటూ వినూత్నంగా నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే దాకా నిరసనతలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీరాములు, నేతలు శ్రీనివాసులు, హరి ఓబన్న శ్రీనివాసులు నాయక్‌తో పాటు కార్మికులు పాల్గొన్నారు.


