వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం

Sep 2 2026 2:46 AM | Updated on Sep 2 2026 2:46 AM

కణేకల్లు: వయోభారంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు హెచ్చెల్సీ వద్ద ఆత్మహత్యకు యత్నించిన ఘటన కణేకల్లులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని బెణికల్లు గ్రామానికి చెందిన లింగాయితీ గిరిజమ్మ, ఎర్రిస్వామికి ముగ్గురు కూతుళ్లుండగా, అందరికీ పెళ్లిళ్లయ్యాయి. ఇటీవల ఎర్రిస్వామి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వయోభారంతో బాధపడుతున్న గిరిజమ్మ జీవితంపై విరక్తి చెంది చనిపోవాలనుకుంది. సాయంత్రం బస్సులో కణేకల్లుకు వచ్చి శివారులో రామనగర్‌లోని హెచ్చెల్సీ వద్దకెళ్లింది. కాలువ గట్టుపై నుంచి దూకే శక్తి కూడా ఆ వృద్ధురాలికి లేదు. ఏదోలా కాలువలో పడి చనిపోవాలనుకున్న ఆమె ర్యాంప్‌ మీదుగా నడుచుకుంటూ కాలువలోపలికి వెళ్లింది. అటుగా వెళుతున్న కొందరు యువకులు గమనించి వెంటనే వృద్ధురాలిని రక్షించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వృద్ధురాలి నుంచి వివరాలు సేకరించి భర్తకు సమాచారమివ్వడంతో ఆయన ఆటోలో వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. తమను చూసుకునే వారు ఎవరూ లేకనే ఆత్మహత్యకు యత్నించినట్లు వృద్ధురాలు తీవ్ర వేదనతో పోలీసులకు చెప్పింది.

పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈల పదోన్నతులకు గీన్‌సిగ్నల్‌

అనంతపురం క్రైం: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగంలో పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2025–26 సంవత్సరానికి సూపరింటెండింగ్‌ ఇంజినీర్ల నుంచి చీఫ్‌ ఇంజినీర్లు (పబ్లిక్‌ హెల్త్‌)గా పదోన్నతి కల్పిస్తూ ఏడుగురు అధికారులతో కూడిన ప్యానెల్‌ను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ జీఓ 207 జారీ చేసింది. అనంతపురం నగరపాలక సంస్థ సూపరిండెంటెంట్‌ ఇంజినీర్‌ జి. రాజశేఖర్‌ పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు. తదుపరి దశలో పోస్టింగ్‌లు కీలకంగా మారాయి. చీఫ్‌ ఇంజినీర్‌ హోదాలో ఎవరికి ఎక్కడ బాధ్యతలు అప్పగించాలన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సంబంధిత అధికారుల పోస్టింగ్‌ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలని ఇంజినీర్‌–ఇన్‌–చీఫ్‌కు ప్రభుత్వం ఆదేశించింది. ఈ పదోన్నతులు ట్రైబ్యునల్‌, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఓఏలు, రిట్‌ పిటిషన్లు, అప్పీళ్లు, రివ్యూ పిటిషన్లు, ప్రత్యేక అనుమతి పిటిషన్లు, సివిల్‌ అప్పీళ్లలో వెలువడే ఆదేశాలు, తుది తీర్పులకు లోబడి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వృద్ధుడి మృతదేహం లభ్యం

గుంతకల్లు రూరల్‌: హంద్రీ–నీవా కాలువలో గల్లంతైన వృద్ధుడు సీతానంద (64) మృతదేహం రాగులపాడు వద్ద లభించింది. కసాపురం ఎస్‌ఐ టీపీ వెంకటస్వామి తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బెల్డోణ గ్రామానికి చెందిన సోమలింగమ్మ, సీతానంద దంపతులు కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దీంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వృద్ధాప్యంలో ఒకరు మరొకరికి భారంగా ఉండకూడదని నిర్ణయించుకున్న వారు ఆగస్టు 30న గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామం వద్ద ఉన్న హంద్రీ–నీవా కాలువ వద్దకు చేరుకున్నారు. ఇద్దరూ ఒకేసారి కాలువలో దూకారు. అయితే అదేరోజు కొద్దిదూరంలో సోమలింగమ్మ మృతదేహం లభ్యం కాగా, సీతానంద మృతదేహం గల్లంతయ్యింది. ఈ క్రమంలోనే మృతదేహం మంగళవారం రాగులపాడు వద్ద లభ్యమైంది. మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు.

రాష్ట్ర స్థాయి బేస్‌బాల్‌

పోటీలకు ఎంపిక

బ్రహ్మసముద్రం: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ధనుష్య రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యాడు. ఆదివారం జిల్లా స్థాయిలో జరిగిన బేస్‌ బాల్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. దీంతో విద్యార్థి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. సెప్టెంబర్‌ 12,13,14 తేదీల్లో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు. విద్యార్థి ధనుష్యను జెడ్పీటీసీ ప్రభావతి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రమౌళి, పీటీలు హుసేన్‌, ఇబ్రహీం, ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement