గోవా లిక్కర్‌ కేసులో ముగ్గురి అరెస్ట్‌! | - | Sakshi
Sakshi News home page

గోవా లిక్కర్‌ కేసులో ముగ్గురి అరెస్ట్‌!

Aug 21 2026 12:22 AM | Updated on Aug 21 2026 12:22 AM

గుట్టుగా విచారణ చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు

తాడిపత్రిటౌన్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోవా లిక్కర్‌ తరలింపు కేసులో పోలీసులు గురువారం ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిసింది. నిందితుల్లో పుట్లూరు మండలానికి చెందిన రామాంజులురెడ్డి, తాడిపత్రి పట్టణానికి చెందిన లక్ష్మీనారాయణరెడ్డి, మాధవ్‌గుప్తా ఉన్నట్లు సమాచారం. అయితే కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో సీఐ ఆరోహణరావు తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏదైనా చిన్న సంఘటన జరిగినా ప్రెస్‌మీట్‌లు పెట్టి ఊదరగొట్టే సీఐ.. గోవా లిక్కర్‌ కేసుపై మాత్రం మౌనం దాల్చడం గమనార్హం. పట్టుబడిన నిందితుల వివరాలు సైతం వెల్లడించకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఇదిలా ఉంటే, ఈ కేసులో సీజ్‌ చేసిన కారులోనే పోలీసులు నిందితుల కోసం గాలించినట్లు తెలిసింది. సీజ్‌ చేసిన కారును ఎలా ఉపయోగిస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

పట్టించిన రూ.20 పంచాయితీ..?

చింతలపల్లి రామాంజులురెడ్డి కొన్నేళ్లుగా గోవా లిక్కర్‌ను అడ్డదారుల్లో తీసుకొస్తూ పట్టణంలో గుట్టుగా వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పటికే పలు పోలీస్‌స్టేషన్లలో అతనిపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. తాడిపత్రి పరిసర ప్రాంతాల్లోని 10 మంది ముఠాగా ఏర్పడి దందా చేస్తున్నట్లు తెలిసింది. గతంలో రామాంజులురెడ్డి పోలీసులకు పట్టుబడిన ప్రతి సారీ కేసును తనపై వేసుకుని మిగిలిన వారిని కాపాడినట్లు తెలు స్తోంది. దీంతో పెట్టుబడి పెట్టి దందా చేసేందుకు చాలా మంది ముందుకు వచ్చేవారు.ఈ క్రమంలో గత సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు గోవా నుంచి అక్రమ మద్యంతో తాడిపత్రికి లారీ చేరుకుంది. అయితే ఒక బ్రాండ్‌ ఫుల్‌ బాటిల్‌ను రూ.650 ధరతోనే ఇస్తానని రామాంజులరెడ్డి స్పష్టం చేయగా, మిగిలిన వారు రూ.630కు ఇవ్వాలని కోరారు. దీనిపై ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచాయితీలు జరిగినా రామాంజులురెడ్డి వినకపోవడంతో విసిగిపోయిన ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చి మొత్తం మద్యాన్నే పట్టించాడనే చర్చ జరుగుతోంది. ఈ సారి కూడా రామాంజులురెడ్డిని మాత్రమే బాధ్యుడిని చేసి పోలీసులు చేతులు దులుపుకుంటారా లేదా మొత్తం మాఫియాను అరెస్ట్‌ చేస్తారా అంటూ పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు.

‘పచ్చ’ బండారం.. బట్టబయలు

‘పచ్చ’ పార్టీ బండారం బట్టబయలైంది. మార్ఫింగ్‌ ఫొటోల గుట్టు రట్టయింది. తాడిపత్రిలో నాలుగు రోజుల క్రితం పెద్ద ఎత్తున గోవా మద్యం పట్టుబడిన విషయం తెలిసిందే. దీనిపై ప్రజల నుంచి విమర్శలు రావడంతో చంద్రబాబు ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ నాయకులు మార్ఫింగ్‌ ఫొటోలతో ఫేక్‌ ప్రచారానికి తెరతీశారు. గోవా లిక్కర్‌ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న చింతలపల్లి రామాంజులురెడ్డి వైఎస్సార్‌సీపీ కార్యకర్త అంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు మార్ఫింగ్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం ప్రారంభించారు. కొంత మంది అత్యుత్సాహంతో ప్రెస్‌మీట్లు పెట్టి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి అంటగట్టే ప్రయత్నాలు చేశారు. అయితే వైఎస్సార్‌సీపీ నాయకులు ఒరిజినల్‌ ఫొటోలు విడుదల చేయడంతో ‘పచ్చ’ పార్టీ నాయకుల విష ప్రచారం బట్టబయలైంది. ఈ క్రమంలో టీడీపీ నాయకుల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement