అనంతపురం క్రైం: మున్సిపల్ పౌర సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్యలను తక్షణమే నిలిపివేయాలని, కాదని ముందుకు వెళ్తే మున్సిపల్ కార్మికులంతా ఏకమై సమ్మెబాట పడతామని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు. గురువారం అనంతపురం రీజియన్ పరిధిలోని 8 జిల్లాలకు చెందిన మున్సిపల్ కమిషనర్లతో స్థానిక ఆర్‌డీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపై మీడియాకు కూడా సమాచారం ఇవ్వలేదు. సమావేశంలో ఈఈఎస్‌ఎల్ (ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్)తో వీధిదీపాల నిర్వహణకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని తెలుసుకున్న సీఐటీయూ, మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ ఈ రోజు వీధిదీపాలు ఇస్తారు.. రేపు పారిశుధ్య, నీటి సరఫరా తదితర అన్ని సేవలనూ ప్రైవేటు పరం చేస్తారంటూ దుయ్యబట్టారు. ప్రైవేటుకు బాధ్యతలు అప్పగిస్తే మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత ఎలా ఉంటుందని ప్రశ్నించారు.కార్మికుల ప్రయోజనాలను కాపాడాల్సిన అధికారులు కూడా కీలుబొమ్మలుగా మారారని మండిపడ్డారు. ఆర్‌డీ నాగరాజు, ఇతర కమిషనర్లు ఒప్పందాలపై సంతకాలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘కూటమి నేతల కోసం మరీ ఇంతలా పనిచేయడం ఏమిటి.. మీ స్థానాల్లో కూటమి నేతలను కూర్చోబెట్టి, చేతులు దులుపుకోండి’ అంటూ ధ్వజమెత్తారు. ఒప్పందంలోని నిబంధనల గురించి కార్మిక సంఘాలకు ఎందుకు వెల్లడించడం లేదని నిలదీశారు.
మూడు గంటలు ఉద్రిక్తత..
సీఐటీయూ, మున్సిపల్ కార్మికుల ఆందోళనతో ఆర్‌డీ కార్యాలయం వద్ద మూడు గంటలపాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించబోమని ఆర్‌డీతో పాటు కొందరు మున్సిపల్ కమిషనర్లు హామీ ఇవ్వడంతో నాయకులు శాంతించారు. 673, 975 జీఓలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్‌డీకి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఈ విధానాన్ని వెనక్కి తీసుకోకుంటే కార్మికులంతా ఏకమై సమ్మెకు దిగుతామని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌వీ నాయుడు, జిల్లా కార్యదర్శి నాగేంద్ర కుమార్, ఉపాధ్యక్షుడు గోపాల్, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు, సీఐటీయూ నగర కోశాధికారి ఎన్టీఆర్ సీనా, భగత్‌సింగ్ ఆటో యూనియన్ నాయకుడు ఆజం భాష తదితరులు పాల్గొన్నారు.


