● సంబంధం లేని అంశంలో వైఎస్సార్ సీపీ బీకేఎస్ మండల కన్వీనర్ అరెస్టు
బుక్కరాయసముద్రం: రెడ్ బుక్ రాజ్యాంగంలో వైఎస్సార్ సీపీ నాయకులపై కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. సంబంధం లేని విషయంలో వైఎస్సార్ సీపీ బీకేఎస్ మండల కన్వీనర్‌ను అరెస్టు చేయడం విమర్శలకు తావిస్తోంది. వివరాలు.. గత నెలలో పీర్ల పండుగ సందర్భంగా చెన్నంపల్లిలో టీడీపీ నాయకుడు భాస్కర్‌రెడ్డితో అదే పార్టీకి చెందిన మల్లికార్జున రెడ్డి వర్గీయులు ఘర్షణ పడ్డారు. ఈ విషయంతో గువ్వల శ్రీకాంత్‌రెడ్డికి సంబంధం లేకపోయినా టీడీపీ నాయకుడు మల్లికార్జున రెడ్డి పోలీసులపై ఒత్తిడి చేయించి గువ్వలతో పాటు మరో ఏడుగురిపై అక్రమంగా కేసు బనాయించినట్లు తెలిసింది. బుధవారం పోలీసులు శ్రీకాంత్‌రెడ్డితో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అయితే, కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గురువారం అందరూ జైలు నుంచి విడుదలయ్యారు.
● బీకేఎస్ మండలం చెన్నంపల్లికి చెందిన గువ్వల శ్రీకాంత్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో కీలకంగా పని చేస్తున్నారు. పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో గువ్వల శ్రీకాంత్‌రెడ్డితో టీడీపీకి నష్టం తప్పదని భావించిన ఆ పార్టీ నేతలు ఇలా కుట్రలకు తెరతీసినట్లు తెలిసింది.


