అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక క్యాంపెయిన్‌ | - | Sakshi
Sakshi News home page

అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక క్యాంపెయిన్‌

Aug 21 2026 12:22 AM | Updated on Aug 21 2026 12:22 AM

అనంతపురం అర్బన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు ఈ నెలలో రెండు సార్లు ప్రత్యేక క్యాంపెయిన్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్‌ వెల్లడించారు. వివరాలను గురువారం తెలియజేశారు. తొలి విడతలో ఈనెల 22, 23 తేదీల్లో, రెండో విడతలో 29, 30 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్‌ ఉంటుందన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి చెందిన బీఎల్‌ఓ రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌ఏతో కలిసి సంబంధిత కేంద్రంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. దరఖాస్తులు స్వీకరించడంతో పాటు సందేహాలు నివృత్తి చేస్తారన్నారు. అదే విధంగా ఓటర్ల పరిశీలన కోసం ఓటర్ల ముసాయిదా జాబితా (ఆబ్సెంట్‌, షిఫ్ట్‌, డెత్‌, డబుల్‌) అందుబాటులో ఉంచుతారన్నారు. ఓటరుగా నమోదుకు ఫారం–6, ఓటరు వివరాల్లో మార్పులు, చేర్పులకు ఫారం–8లో దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు కలెక్టర్‌ సూచించారు. ప్రత్యేక క్యాంపెయిన్‌పై ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలు విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు.

23 నుంచి ఏఈఈ పరీక్షలు

అనంతపురం అర్బన్‌: ఏపీ పవర్‌ యుటిలిటీస్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఆర్‌ఓ మలోల తెలిపారు. పరీక్షల నిర్వహణపై డీఆర్‌ఓ గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. సమావేశంలో ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌, కలెక్టరేట్‌ ఏఓ అలెగ్జాండ్‌ పాల్గొన్నారు.

సెంట్రల్‌ వర్సిటీ

ఇన్‌చార్జ్‌ వీసీగా షీలారెడ్డి

అనంతపురం: సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ (సీయూఏపీ) ఇన్‌చార్జ్‌ వీసీగా ప్రొఫెసర్‌ సి. షీలారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది వరకు వీసీగా ఉన్న డాక్టర్‌ ఎస్‌ఏ కోరి పదవీ కాలం గతేడాది ముగియగా.. ఏడాది పాటు పొడిగించారు. ఆ పదవీ కాలం గురువారం ముగియడంతో సెంట్రల్‌ వర్సిటీ డీన్‌గా ఉన్న సి. షీలా రెడ్డిని ఇన్‌చార్జ్‌ వీసీగా నియమించారు. ఈ క్రమంలోనే బాధ్యతలు చేపట్టిన ఆమెకు డాక్టర్‌ కోరి శుభాకాంక్షలు తెలిపారు.

● పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, అంతర్జాతీయ సంబంధాలపై పీహెచ్‌డీ పూర్తి చేసిన ప్రొఫెసర్‌ షీలారెడ్డి 2006 నుంచి 2011 వరకు ఎస్వీ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. సోషియో– పొలిటికల్‌ డెవలప్‌మెంట్‌లో చైర్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి దక్కించుకున్న ఆమె శ్రీ వెంకటేశ్వర కళాశాల, యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీలో ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. యూనివర్సిటీ ఆఫ్‌ పోస్ట్‌డామ్‌ (జర్మనీ)లో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌పై అవగాహన కల్పించారు. 14 అంతర్జాతీయ జర్నల్స్‌, 19 జాతీయ జర్నల్స్‌, 14 పుస్తకాలు రచించారు. 5 మేజర్‌, 5 మైనర్‌ ప్రాజెక్ట్‌లు పూర్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement