ఉరవకొండ:ఎన్నో ఆశలతో లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని, అయినా నీళ్లివ్వకుండా తమ బతుకులతో ఆటలాడడం తగదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీ–నీవా కాలువ ద్వారా పంట పొలాలకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రైతులు రోడ్డెక్కారు. మండల పరిధిలోని నింబగల్లు, వ్యాసాపురం తదితర గ్రామాలకు చెందిన రైతులు అనంతపురం–బళ్లారి 42వ జాతీయ రహదారిని దిగ్బంధించేందుకు యత్నించగా.. ఎస్‌ఐ జనార్దన్‌నాయుడు సిబ్బందితో కలిసి వెళ్లి రైతులను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే రైతులు ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అధికారుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హంద్రీ–నీవా కాలువకు నీళ్లొస్తాయనే ఆశతో మిర్చి, మొక్కజొన్న, వేరుశనగ తదితర పంటలు సాగు చేశామన్నారు. మోపిడి గ్రామం వద్ద ఉన్న హంద్రీ–నీవా 34వ ప్యాకేజీ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీకి కేవలం వారం పాటు నీటిని విడుదల చేసి నిలిపివేశారన్నారు. దీంతో తమ పొలాలకు నీరు చేరడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఏం వస్తుందంటూ ప్రభుత్వ తీరుపై ఆక్రోశం వెళ్లగక్కారు. హంద్రీ–నీవా అధికారులు నీటి విడుదలపై స్పష్టత ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. రైతులతో పోలీసులు బలవంతంగా ఆందోళనను విరమింపజేశారు.
నీటిని విడుదల చేయండి సార్..
వజ్రకరూరు: మండల పరిధిలోని రాగులపాడు గ్రామ సమీపంలోని హంద్రీ–నీవా కాలువ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు తదితర గ్రామాలకు చెందిన రైతులు తూము వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ హంద్రీ–నీవా ప్రధాన కాలువ నుంచి రామగిరి చెరువుకు వెళ్లే తూముకు నీటిని విడుదల చేయాలని కోరారు. హంద్రీ–నీవా నీరు వస్తాయన్న ఆశతో పంటలు సాగు చేశామని, వర్షాలు లేక పంటలు ఎండుముఖం పట్టినట్లు వాపోయారు. నీటి విడుదల ఆలస్యమైతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వజ్రకరూరు ఎస్‌ఐ నాగస్వామి అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడి, వెంటనే హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు అక్కడకు చేరుకుని రైతులకు సర్దిచెప్పారు. రైతుల విజ్ఞప్తిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతుల రాస్తారోకో వజ్రకరూరు: హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అధికారులతో మాట్లాడుతున్న రైతులు


