● డాక్టర్ ఉమర్ ఇంట్లో ‘రాజకీయ విందు’
అనంతపురం క్రైం: అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీ నాయకుల్లో అసంతృప్త జ్వాలలు రగులుతున్నాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌కు సొంత పార్టీలోనే అసమ్మతి సెగ తగులుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు గురువారం రాత్రి జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ చమన్‌సాబ్ కుమారుడు డాక్టర్ ముక్తార్ నివాసంలో నిర్వహించిన విందు సమావేశమే నిదర్శనంగా నిలుస్తోంది. టీడీపీ సీనియర్ నాయకుడు కేఎం షకీల్ షఫీ, టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు జేఎల్ మురళీధర్, మాజీ కార్పొరేటర్ నటేష్ చౌదరి, మైనార్టీ నాయకుడు తాజుద్దీన్‌తో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు విందుకు హాజరై భవిష్యత్ రాజకీయాలపై విస్తృతంగా చర్చించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవి మైనార్టీలకు వస్తే బలిజలు మద్దతుగా నిలిచేలా.. బలిజలకు అవకాశం వస్తే మైనార్టీలు అండగా నిలిచేలా రెండు సామాజిక వర్గాల వారూ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే వ్యవహారశైలిపై కొందరు నాయకులు, కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తిపైనా చర్చ జరిగినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
అంతర్‌జిల్లా
దొంగల ముఠా అరెస్ట్
అనంతపురం సెంట్రల్: ప్రయాణికులను ఏమార్చి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ముఠా సభ్యులను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 46 లక్షలు విలువజేసే బంగారు, వెండి ఆభరణాలు, రూ.2.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం పోలీసుకాన్ఫరెన్స్‌హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ జగదీష్ వెల్లడించారు. అరెస్టయిన వారిలో గుత్తి పట్టణంలోని మారుతీనగర్ జెడ్.వీరారెడ్డి కాలనీకి చెందిన వనార్చి పద్మ, రేఖాందరి బుజ్జమ్మ, రేఖాందరి శీను, వనార్చి బాలయ్య, రేఖాందరి వెంకటసాయి, రేఖాందరి లక్ష్మీ నరసింహ, వనార్చి మహేష్ ఉన్నారు. వీరందరూ సమీప బంధువులే కావడం గమనార్హం. వీరి నుంచి రూ.46 లక్షలు విలువ చేసే 313.14 గ్రాముల బంగారు, 100 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రూ. 2.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లు, రద్దీగా ఉండే సెంటర్లు, ఆటోల్లో ప్రయాణించే మహిళలు, వృద్దులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడేవారు. గతేడాది నవంబర్‌లో ఆకుతోటపల్లికి చెందిన ఓ మహిళ ఆటోలో వస్తుండగా ఆమె దృష్టి మరల్చి హ్యాండ్ బ్యాగ్‌లోని 25 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుంగా చేపట్టగా.. తీగలాగితే డొంక కదిలినట్లు నిందితుల నేర చరిత్ర బయటపడింది. నిందితులు గతంలో ప్రకాశం, కడప, బనగానపల్లి, జమ్మలమడుగు, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు.
జేఎన్‌టీయూ(ఏ)కు
ఐఎస్‌ఓ సర్టిఫికెట్
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్ దక్కింది. మొత్తం ఏడు అంశాల్లో ఐఎస్‌ఓ గుర్తింపు దక్కినట్లు హిమ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి ఆలపాటి శివయ్య తెలిపారు. ఈ మేరకు జేఎన్‌టీయూ (ఏ) వీసీ ప్రొఫెసర్ సుదర్శనరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ ఐఎస్‌ఓ సర్టిఫికెట్ అందించారు. మరిన్ని నాణ్యమైన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి తగు సూచనలను, సలహాలను ఇచ్చామన్నారు.
రైతుల కోసం
‘సెరెంటికా’ హెల్ప్‌లైన్
అనంతపురం అర్బన్: గాలిమరలు, సోలార్ ఏర్పాటు క్రమంలో ఎదురయ్యే సమస్యలు, అపోహలు తొలగించేందుకు రైతుల కోసం సెరెంటికా కంపెనీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. రైతులు భూమికి సంబంధించిన అంశాలు, నష్టపరిహారం చెల్లింపు తదితర వాటి గురించి సందేహాలుంటే 1800 309 7701 నంబర్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సెరెంటికా హెల్ప్‌లైన్ నంబర్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం, కర్నూలు జిల్లాలలోని రైతులతో సమాచార మార్పిడి, పాదర్శకత, నమ్మకాన్ని మరింత బలోపేతం చేసేందుకు సెరెంటికా కంపెనీ ప్రారంభించిన ప్రత్యేక ఫార్మర్స్ హెల్ప్‌లైన్ రైతులకు ఎంతగానో ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు తేజా, ఆనంద్, రామదుర్గ, అనిల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.


