రైతుల ఆక్రందనలు పట్టవా? | - | Sakshi
Sakshi News home page

రైతుల ఆక్రందనలు పట్టవా?

Aug 15 2026 1:39 AM | Updated on Aug 15 2026 1:39 AM

అనంతపురం: కరువు కోరల్లో చిక్కుకున్న రైతుల ఆక్రందనలు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు పట్టవా అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా భూగర్భజలాలు అడుగంటిపోయాయని, చాలా ప్రాంతాల్లో భూగర్భజల మట్టం 40 మీటర్లకు పడిపోయిందని చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అమలు చేసిన ఉచిత పంటల బీమాకు చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడి.. రైతుల నుంచి ప్రీమియం కట్టించుకుంటోందని తెలిపారు. ఈ ఖరీఫ్‌లో జిల్లా రైతులు 8.20 లక్షల ఎకరాలకు బీమా చేయించినా.. పంటలు సాగులోకి వచ్చింది మాత్రం 4.10 లక్షల ఎకరాలేనని పేర్కొన్నారు. ప్రస్తుతం వేరుశనగ, కంది, ఆముదం, పత్తి పంటలు వేసుకునే పరిస్థితి లేదని సాక్షాత్తూ వ్యవసాయ శాఖ అధికారులే చెబుతున్నారని తెలిపారు. మరోవైపు జిల్లాలో 40 లక్షల వరకు పశుసంపద ఉందని, ఒక్కో పశువుకు రోజుకు 30 కిలోల వరకు గ్రాసం అవసరం అవుతుందని అన్నారు. అయితే క్షేత్రస్థాయిలో పశుగ్రాసం, నీటి కొరత తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పశుసంపదను పెద్ద ఎత్తున మార్కెట్‌ యార్డులకు తరలిపోతోందన్నారు. ఇంతటి కరువు పరిస్థితులు ఉన్నా రైతుల్లో ఆత్మస్థయిర్యం నింపేలా ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కనీసం ఒక్క సమీక్ష చేసే తీరిక కూడా లేకపోయిందని మండిపడ్డారు. మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆర్‌అండ్‌బీలో, మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ధర్మవరంలో.. మంత్రి సవితమ్మ పెనుకొండలో నామమాత్రపు సమావేశాలకే పరిమితమయ్యారని విమర్శించారు. తమ నియోజకవర్గాల్లోని పరిస్థితులను ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో బిల్డింగులు, రోడ్డు పనులు పేరుతో ప్రచారం చేసుకోవడం తప్పితే కరువు నివారణపై దృష్టిపెట్టడం లేదన్నారు.

రైతులకు సాయం ఏదీ..?

చంద్రబాబు ప్రభుత్వంలో పంటల బీమాను అస్తవ్యస్తంగా మార్చేశారని అనంత వెంకట రామిరెడ్డి మండిపడ్డారు. 2023 ఏడాది చివరి నుంచి ఇప్పటి వరకు 200 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. బాధిత కుటుంబాలకు పరిహారం కూడా అందించకపోవడం దారుణమన్నారు. 2024 ఖరీఫ్‌, రబీతో పాటు 2025 ఖరీఫ్‌కు సంబంధించి బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ రైతులకు అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించి, ప్రత్యేకంగా పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే పశువులను కలెక్టరేట్‌కో.. ప్రభుత్వ కార్యాలయాల వద్దకో తోలే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

అడుగంటిన భూగర్భజలాలు

తీవ్రమవుతున్న పశుగ్రాసం,

నీటి కొరత

జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో

పడని విత్తనం

కరువు వెంటాడుతున్నా సమీక్ష చేయలేని స్థితిలో ప్రజాప్రతినిధులు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement