బొమ్మనహాళ్: ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్, జిల్లా ప్రజల వరప్రదాయిని తుంగభద్ర జలాశయంలో 88 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. మంగళవారం 41,167, బుధవారం 34,051 క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో గురువారం నాటికి 26,834 క్యూసెక్కులకు తగ్గింది. తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాలైన మలెనాడు, శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి, చిక్‌మంగళూరు, వరనాడులో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద తగ్గుతూ వస్తోంది.
కణేకల్లు చేరిన
తుంగభద్ర జలాలు
కణేకల్లు: తుంగభద్ర జలాలు బుధవారం రాత్రి కణేకల్లుకు చేరాయి.స్థానిక చెరువు నిండటంతో నీటిని హెచ్చెల్సీ అధికారులు దిగువకు వదిలారు. తాగునీటి అవసరాల కోసం నీటిని పీఏబీఆర్‌కు తరలించనున్నట్లు తెలిపారు. రైతులు జలచౌర్యం చేయరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తిరుపతి–విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని గుంతకల్లు, గుంటూరు మీదుగా తిరుపతి–విశాఖపట్నం మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుపుతున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 10 వరకు ఆది, గురువారాల్లో తిరుపతి జంక్షన్ (08509) నుంచి ఉదయం 9.50 గంటలకు రైలు బయలుదేరుతుందన్నారు. తాడిపత్రికి మధ్యాహ్నం 1.53 గంటలకు, గుత్తి 2.43, గుంతకల్లు జంక్షన్‌కు సాయంత్రం 4.15 గంటలకు చేరుకుంటుందన్నారు. రేణిగుంట, కడప, యర్రగుంట్ల, డోన్, బేతంచర్ల, నంద్యాల, దిగువమిట్ట, మార్కాపురం రోడ్డు జంక్షన్, దొనకొండ, నర్సరావుపేట, గుంటూరు జంక్షన్, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట మీదుగా రైలు ప్రయాణిస్తుందన్నారు. అలాగే, ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 11 వరకు మంగళ, శుక్రవారాల్లో విశాఖపట్నం జంక్షన్ (08510) నుంచి రైలు బయలుదేరుతుందన్నారు. గుంత కల్లుకు 10.35 గంటలకు, గుత్తి– 11.13, తాడిపత్రికి మధ్యాహ్నం 12.08 గంటలకు వస్తుంద న్నారు. రైళ్లలో ఫస్ట్ క్లాస్, 2 ఏసీ బోగీలు ఒకటి చొప్పున, త్రీ టైర్ ఏసీ– 4, స్లీపర్– 10, జనరల్ బోగీలు 4 ఉంటాయన్నారు.
విద్యుదాఘాతానికి
యువరైతు బలి
డి.హీరేహాళ్
(బొమ్మనహాళ్): పొలంలో మోటార్ ఆన్ చేయడానికి వెళ్లిన యువరైతు సతీష్‌రెడ్డి (31) విద్యుదాఘా తానికి గురై మృతి చెందిన ఘటన డీ.హీరేహాళ్ మండలం చెర్లోపల్లిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సతీష్‌రెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం మండలంలోని సోమలాపురానికి చెందిన నందినిని వివాహం చేసుకున్నాడు. వరి నాట్ల పనుల కోసం సమీపంలోని శంకరప్ప పొలంలో మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తూ విద్యుత్ వైర్ తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా నిలిపివేసి సతీష్‌రెడ్డిని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతుడి తండ్రి రామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.


