గుంతకల్లు: స్థానిక సత్యనారాయణ పేటలోని విజయనగర్ కాలనీలో ఈ ఏడాది మార్చి 26న ఓ ఇంటి సమీపంలో అప్పుడే పుట్టిన కోతి పిల్ల కళ్లు కూడా తెరవలేని స్థితిలో నిస్సహాయంగా పడి ఉంది. కారణం తెలీదు కానీ తల్లి వానరం అక్కడ కనిపించలేదు. కొన ఊపిరితో రోడ్డుపై పడిఉన్న కోతిపిల్లకు వీధి జనం చేతనైన సపర్యలు చేశారు. ఈ సమాచారాన్ని రైల్వే విశ్రాంత ఉద్యోగి ఫెర్నాండెజ్, నిర్మల దంపతులకు కాలనీవాసులు చేరవేయగా.. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని బుల్లి వానరాన్ని అక్కున చేర్చుకున్నారు. వెంటనే వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. తర్వాత దాన్ని ఇంటికి తీసుకెళ్లి పిల్లలు లేని తమకు దేవుడిచ్చిన కానుకగా భావించి కన్నబిడ్డలా చూసుకుంటున్నారు.
ఘనంగా నామకరణం...
బుల్లి వానరానికి ప్రస్తుతం 5 నెలలు కాగా, పేరు పెట్టాలని ఇటీవల ఆ దంపతులు భావించారు. శ్రీరామనవమి రోజు తమ వద్దకు చేరడంతో ఏ పేరు పెడితే బాగుంటుందని చాట్‌జీపీటీని అడగ్గా... ‘హనుమాన్’ పేరు సూచించింది. ఫెర్నాండెజ్ క్రిస్టియన్ అయినా ఏ మాత్రమూ సంకోచించకుండా హనుమాన్ పేరులోని చివరి అక్షరాలను తీసుకుని ‘మను’ అని పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 12న బుధవారం బుల్లి వానరానికి కొత్త దుస్తులు తొడిగి, అందంగా అలంకరించి, కొవ్వొత్తుల వెలుగులో కేక్ కట్ చేసి ‘మను’ అని నామకరణం చేశారు. బంధుమిత్రులను ఆహ్వానించి విందు భోజనం కూడా ఏర్పాటు చేయడం ఆసక్తి కలిగించింది.


