● ప్రయాణికులపై రైల్వే అధికారుల కొరడా
గుంతకల్లు: ప్రయాణికుల భద్రతతోపాటు రైల్వేకు ఆదాయం చేకూరాలనే ఉద్దేశంతో ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీనియర్ డీసీఎం మనోజ్ తెలిపారు. సోమవారం గుంతకల్లు డివిజన్ వ్యాప్తంగా ఏసీఎం ధనుంజయ్‌సింగ్ నేతృత్వంలో 74 మంది సిబ్బందితో 28 రైళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 1,314 కేసులు నమోదు చేసి రూ.10,83,950 జరిమానా వసూలు చేసినట్లు వెల్లడించారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 657 మంది నుంచి రూ.6,32,175, సాధారణ టికెట్‌తో ఏసీ బోగీల్లో ప్రయాణిస్తున్న 542 మంది నుంచి రూ.4,19,975, అధిక లగేజ్‌తో ప్రయాణిస్తున్న 115 మంది నుంచి రూ.31,800 అపరాధ రుసుం వసూలు చేసినట్లు వివరించారు. ప్రయాణికులు నిబంధనల ప్రకారం ప్రయాణిస్తూ రైల్వే అభివృద్ధికి సహకరించాలని కోరారు.
వ్యక్తి బలవన్మరణం
శెట్టూరు: వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల పరిధిలోని బుడ్డయ్యదొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. బుడ్డయ్యదొడ్డికి చెందిన గొల్ల రాజశేఖర్ (39)కు భార్య లక్ష్మీదేవి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాజశేఖర్ ఆటోను నడుపుతూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవాడు. ఆటో ద్వారా సరిపడా సంపాదన లేకపోవడంతో మదనపడుతుండేవాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి గ్రామ శివారులోని వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. మృతుని భార్య లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రేపటి నుంచి
ఆ రైల్వే గేట్ మూత
అనంతపురం సిటీ: జంగాలపల్లి – ప్రసన్నాయపల్లి మధ్య 206/2–4 కి.మీ వద్ద ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్ 125వ నంబర్ గేట్‌ను తాత్కాలికంగా మూసి వేయనున్నట్లు దక్షిణ తీర రైల్వే అనంతపురం ఎస్‌ఎస్‌ఈ నీలిశశిధర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైల్వే నిర్వహణ పనుల్లో భాగంగా ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకూ ఈ మార్గంలోని గేట్‌ను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. మోటారు వాహనదారులు ఇతర మార్గాల్లో ప్రయాణించాలని కోరారు.
యువకుడి ఆత్మహత్య
ఉప్పల్ (హైదరాబాద్): యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామంతాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వజ్రకరూరు మండలం పెద్ద చిన్న ప్యాపిలి తండాకు చెందిన ఎం.దేవరాజు నాయక్ బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి రామంతాపూర్‌లోని శ్రీ దుర్గా బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు. మంగళవారం టీ తాగి వస్తానని తన సోదరుడు జయరాం నాయక్‌కు చెప్పి బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో జయరాం వెతకగా హాస్టల్ బాత్‌రూమ్‌లోని వెంటిలేటర్ కిటికీకి ఉరికి వేలాడుతూ కనిపించాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. జయరాం నాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


