వసూల్‌ ‘రాజా’పై వేటుకు రంగం సిద్ధం! | - | Sakshi
Sakshi News home page

వసూల్‌ ‘రాజా’పై వేటుకు రంగం సిద్ధం!

Aug 12 2026 12:52 AM | Updated on Aug 12 2026 12:52 AM

అనంతపురం సెంట్రల్‌: నగరంలోని వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో వసూల్‌ ‘రాజా’పై చర్యలకు రంగం సిద్ధమైంది. ఆయన అక్రమాలపై నేరుగా ఎస్పీకి ఫిర్యాదులు వెళ్లడంతో విచారించి చార్జ్‌ మెమో ఇచ్చినట్లు తెలిసింది. త్వరలో ఆయనపై బదిలీ వేటు పడే అవకాశమున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. వివరాలు... నగరంలో వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో అవినీతి, అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. స్టేషన్‌ పరిధిలో మట్కా, పేకాట, బెట్టింగ్‌, బియ్యం అక్రమ రవాణా లాంటి అసాంఘిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం షాపులు, బార్‌లు, ధాబాలు, ముఖ్యమైన షాపుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారని అంతా కోడై కూస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే నెలవారి మామూళ్లు ఫిక్స్‌ చేసుకున్నారని, ఈ తతంగం మొత్తం సదరు పోలీసు అధికారి కనుసన్నల్లో జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. స్టేషన్‌లో చాలా మంది కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు ఉన్నప్పటికీ పెత్తనం ఆయనే చెలాయిస్తున్నారు.

ఎస్పీ దృష్టికి అక్రమాలు..

సదరు పోలీసు అధికారి అక్రమాలపై గతంలో ‘సాక్షి’లో కథనం వెలువడింది. తాజాగా ఆయన అక్రమాలను స్పెషల్‌ బ్రాంచ్‌ వర్గాలు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. వారి నివేదిక ఆధారంగా చార్జ్‌మెమో ఇచ్చినట్లు సమాచారం. ఆయనతో పాటు వత్తాసు పలుకుతున్న స్టేషన్‌ అధికారికి కూడా చార్జ్‌ మెమో ఇచ్చినట్లు తెలిసింది. దీన్ని బట్టి అవినీతి అక్రమాల్లో వాటాలున్నట్లు స్పష్టమవుతోంది. అక్రమాల సంగతి పక్కన పెడితే ఎస్పీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓ కార్యక్రమానికి కూడా ఆ అధికారి మోకాలడ్డేందుకు యత్నించినట్లు తెలిసింది. అందరూ తన చెప్పు చేతల్లో ఉన్నారని చెప్పుకుంటూ గతంలో స్టేషన్‌ బాస్‌లను కూడా బెదిరించినట్లు తెలిసింది. తాజాగా సదరు అధికారికి చార్జ్‌మెమో ఇచ్చిన నేపథ్యంలో వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ ప్రక్షాళనకు ఒక అడుగు పడిందని పోలీసు సిబ్బందే చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement