● 24 గంటల్లోనే ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
వజ్రకరూరు: మండలంలోని కొనకొండ్ల మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. పోలీసులు 24 గంటల్లోనే పిల్లల ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉరవకొండ పోలీస్‌స్టేషన్‌లో సీఐ మహానంది మంగళవారం వివరాలు వెల్లడించారు. కొనకొండ్ల మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ప్రశాంత్‌కుమార్, వడ్ల బద్రి సోమవారం సాయంత్రం ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దీనిపై పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీరాణి వజ్రకరూరు ఎస్‌ఐ నాగస్వామికి ఫిర్యాదు చేయగా.. విషయాన్ని ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్పీ జగదీష్ వెంటనే స్పందించి గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్‌ని అప్రమత్తం చేశారు. ఉరవకొండ సీఐ, ఎస్‌ఐ, వజ్రకరూరు, బెళుగుప్ప, విడపనకల్లు ఎస్‌ఐలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం విద్యార్థులు ఉరవకొండ మండలం మోపిడి గ్రామంలోని వారి స్నేహితుడు భరత్ ఇంటి వద్ద ఉన్నట్లు గుర్తించారు. వారిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. 24 గంటల్లోనే విద్యార్థుల ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించడంలో శ్రద్ధ వహించిన గుంతకల్లు డీఎస్పీ, ఐదు బృందాలను ఎస్పీ జగదీష్ ప్రత్యేకంగా అభినందించారు.


