వజ్రకరూరు: రాగులపాడు సమీపంలోని హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం లిఫ్ట్ వద్దకు కృష్ణా జలాలు చేరుకున్నాయి. ఈ నెల 5న కర్నూలు జిల్లా మల్యాల వద్ద నీటి పంపింగ్ ప్రారంభించగా, 9వ తేదీన అనంతపురం జిల్లాలోకి ప్రవేశించాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వజ్రకరూరు మండలం రాగులపాడు లిఫ్ట్ వద్దకు కృష్ణా జలాలు చేరుకున్నాయి. మొదట ఒక పంపుతో నీటి పంపింగ్ ప్రారంభించిన అధికారులు నీటి ప్రవా హం పెరగడంతో ఆరు పంపులకు పెంచారు. ఈ క్రమంలో హంద్రీ–నీవా ప్రధాన కాలువ నుంచి జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు పరుగులు తీస్తున్నాయి. కృష్ణా జలాల రాకతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాగులపాడు లిఫ్ట్ నుంచి మొత్తం 1,900 క్యూసెక్కుల మేర నీరు పంపింగ్ అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. హంద్రీ–నీవా ఈఈ శ్రీనివాస్‌నాయక్, ఏఈ సురేష్‌కుమార్‌నాయక్ కాలువలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. నీటిని తాగు అవసరాలకు మాత్రమే వినియోగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.


