అనంతపురం సిటీ: జిల్లా సర్వజనాస్పత్రిని అసహనం అనే రుగ్మత ఆవరించింది. కోవిడ్ – 19 సమయంలో తమకు, తమ కుటుంబాలకు ప్రమాదం పొంచి ఉంటుందని తెలిసినా రోగుల సంరక్షణకే వైద్యులు, నర్సులు తొలి ప్రాధాన్యతినిస్తూ వచ్చారు. ఈ క్రమంలో చాలా మంది వైద్యులు, నర్సులు ప్రాణాలను సైతం కోల్పోయారు. ప్రస్తుతం అంతటి దారుణమైన పరిస్థితులు నేడు లేకున్నా... ఎందుకో తెలియని అసంతృప్తి.. అసహనం జీజీహెచ్‌లోని వైద్యులు, సిబ్బందిలో వ్యక్తమవుతోంది. ఇది అక్కడ అందుతున్న వైద్య సేవలపై పడుతోంది.
అడుగడుగునా అసహనం
సర్వజనాస్పత్రిలో అడుగు పెట్టింది మొదలు సెక్యూరిటీ సిబ్బంది నుంచి వైద్యుల వరకూ ప్రతి ఒక్కరి నుంచి రోగులు అసహనాన్ని చవిచూడాల్సి వస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది లెక్కలేని తనంతో వ్యవహరిస్తూ ఒక్క చోట స్థిరంగా కూర్చొనివ్వడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక ఓపీ చీటీ తీసుకుని వైద్యుడి వద్దకెళితే... అక్కడ వార్డు బాయ్ పెత్తనం ఆషామాషీగా ఉండడం లేదు. జబ్బులతో బాధపడుతున్న వారి పట్ల కనీస సానుభూతి చూపకుండా దురుసుగా వ్యవహరిస్తూ వివాదానికి తెరతీస్తున్నారు. ఇంత చేసినా చివరకు వైద్యుడి గదిలో రోగులను గుంపుగుంపులుగా పంపించేస్తుంటారు. దీంతో చికిత్సలు కాస్త యాంత్రికంగా మారిపోతున్నాయి. తమను వేధిస్తున్న జబ్బు గురించి రోగులు వివరించబోయినా అక్కడ వినే ఓపిక వైద్యుల్లో ఉండడం లేదు.
మార్పు తెచ్చే చిన్నపాటి ఓర్పు
వైద్యులు తమ కోపాన్ని రోగులపై చూపించడం అసాధారణం. గతంలో ఎన్నడూ లేనంతగా సర్వజనాస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంటే సర్వజనాస్పత్రి వైద్యులపై నమ్మకం పెరిగిందనేందుకు ఇదే నిదర్శనం. ఇలాంటి తరుణంలో రోగులతో అర్థవంతమైన సంభాషణలతో చికిత్స అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న పాటి ఓర్పుతో ఇది సాధ్యమవుతుందని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు.
పరువు పోవడం తప్ప..
జబ్బు బారిన పడిన వారు ఏన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చివరకు చికిత్స కోసం ఆస్పత్రికి వస్తుంటారు. అయితే వారి వేదనను సానుకూలంగా అర్థం చేసుకుని చికిత్స అందజేసే వైద్యులు నేడు కరువయ్యారు. సహనం కోల్పోతే అందరి ముందు పరువు పోవడం తప్ప, ప్రత్యేకంగా ఒనగూరేది ఏదీ ఉండదని వైద్యులు గుర్తించకపోవడం దురదృష్టకరం. అసహనానికి కారణమైన రద్దీని క్రమబద్ధీకరించుకోలేకపోవడం ప్రధాన వైఫల్యంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో పని ఒత్తిడి పెరిగి ఎదుటి వ్యక్తిపై కోపంతో అరవడం, తిట్టడం లాంటివి చేస్తుంటారు.


