బూదగవిలో ‘శ్రీసత్యసాయి’ కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

బూదగవిలో ‘శ్రీసత్యసాయి’ కలెక్టర్‌

Aug 9 2026 2:10 AM | Updated on Aug 9 2026 2:10 AM

ఉరవకొండ: రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన బూదగవి సూర్యనారాయణస్వామి దేవాలయాన్ని శనివారం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ కుటుంబ సమేతంగా సందర్శించారు. కలెక్టర్‌కు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి కలెక్టర్‌ దంపతులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్‌ చిరంజీవి, సుధా ఆధ్వర్యంలో కలెక్టర్‌ దంపతులను ఘనంగా సత్కరించారు. స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించి, తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఉరవకొండ తహసీల్దార్‌ అరుణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

● ప్రసిద్ధి గాంచిన పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి వారిని కూడా కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకానాథచార్యులు, సిబ్బంది స్వాగతం పలికారు. స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం కలెక్టర్‌ను ఘనంగా సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందించారు.

వృద్ధుడి తలపై వెళ్లిన ఆర్టీసీ బస్సు

తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి

ధర్మవరం అర్బన్‌: ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్‌లో గుర్తు తెలియని వృద్ధుడిపై ఆర్టీసీ బస్సు వెళ్లడంతో తల చిధ్రమై మృతి చెందాడు. వన్‌ టౌన్‌ ఎస్‌ఐ ఇషాక్‌బాష తెలిపిన మేరకు.. ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులు బయటకు వచ్చే రోడ్డుపైన గుర్తు తెలియని వృద్ధుడు (70) శుక్రవారం అర్ధరాత్రి మద్యం తాగి నిద్రపోయాడు. శనివారం తెల్లవారుజామున పుట్టపర్తి డిపో ఆర్టీసీ బస్సు ఆ వృద్ధుడి తలపై వెళ్లింది. దీంతో అతని తల చిధ్రమై అక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న వన్‌ టౌన్‌ ఎస్‌ఐ ఇషాక్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడి ఆచూకి తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

నాన్‌ టీచింగ్‌ సిబ్బంది

సీనియారిటీ జాబితా విడుదల

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఉమ్మడి అనంతపురం జిల్లా విద్యాశాఖ పరిధిలోని నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి సంబంధించిన సీనియారిటీ జాబితాను డీఈఓ బ్లాగ్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డా.అయూబ్‌ హుస్సేన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత నాన్‌ టీచింగ్‌ సిబ్బంది తమ సీనియారిటీ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. జాబితాలో ఏవైనా అభ్యంతరాలు, తప్పులు లేదా సవరణలు ఉంటే వాటిని సోమవారం మధ్యాహ్నంలోపు అనంతపురంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి తెలియజేయాలని కోరారు. నిర్దేశిత గడువులోగా అభ్యంతరాలు, సవరణలను తెలియజేయాలని, అనంతరం వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవబడవని డీఈఓ స్పష్టం చేశారు.

టికెట్‌ లేకుండా ప్రయాణం.. రూ.1.63 లక్షల జరిమానా

గుంతకల్లు: ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లలో టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తున్న వారిపై కమర్షియల్‌ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. అసిస్టెంట్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ధనుంజయ్‌ కుమార్‌ సింగ్‌ నేతృత్వంలో 18 మంది సిబ్బంది దాడులు చేపట్టారు. గుంతకల్లు–కడప–రేణిగుంట మధ్య నడుస్తున్న 14 ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లలో టికెట్‌ లేని ప్రయాణికులు 260 మందిని గుర్తించి రూ.1,63,750 జరిమానా వసూలు చేశారు.

దొంగతనం కేసు ఛేదింపు

4 తులాల బంగారు, రూ. 5 లక్షలు స్వాధీనం

అనంతపురం సెంట్రల్‌: నగరంలో కోవూర్‌నగర్‌లో మహబూబ్‌ బాషా ఇంట్లో జరిగిన దొంగతనం కేసును ఛేదించినట్లు నాల్గో పట్టణ సీఐ ఏపీ మస్తాన్‌ తెలిపారు. కొన్ని నెలల క్రితం మహబూబ్‌బాషా భార్య అఫ్రిన్‌కు సొంత బంధువులు ఇంట్లో భద్రపరిచిన బంగారు ఆభరణాలను దొంగిలించారు. వారి ఫిర్యాదు మేరకు కదిరిలోని గాంధీనగర్‌కు చెందిన నిఖత్‌ అంజుమ్‌, మొహమ్మద్‌ రహిల్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. దొంగిలించిన ఆభరణాల్లో కొన్నింటిని విక్రయించి రూ. 5 లక్షలు తీసుకున్నట్లు వెల్లడైంది. మిగిలిన బంగారు ఆభరణాలను విక్రయించేందుకు తీసుకెళ్తుండగా పట్టుబడినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి 4 తులాల బంగారు నగలు, రూ.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement