బెళుగుప్ప: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన బెళుగుప్పలో తీవ్ర విషాదం నింపింది. వివరాలు.. బెళుగుప్పకు చెందిన మాలపాటి వెంకటేశులు రత్నమ్మ దంపతులకు శోభ, లత, రోజా, అశోక్‌రెడ్డి సంతానం. వెంకటేశులు జీవనోపాధి నిమిత్తం పెద్దపప్పూరు మండలం తురకపల్లికి కుటుంబంతో కలిసి వలస వెళ్లాడు. భూములను కౌలు చేస్తూ వచ్చిన ఆదాయంతో కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాడు. ఎంబీఏ పూర్తి చేసిన కుమారుడు అశోక్ రెడ్డి ఆరేళ్లుగా చైన్నెలోని ‘ది బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్’లో పనిచేస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున చైన్నెలోని తన కార్యాలయంలో విధులు ముగించుకున్న అశోక్‌రెడ్డి మరో ఇద్దరు తోటి ఉద్యోగులతో కలిసి కారులో తన రూముకు బయలుదేరాడు. మార్గమధ్యంలో కారు లారీని ఢీకొనడంతో తీవ్ర గాయాలైన అశోక్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అశోక్ రెడ్డికి 8 నెలల క్రితమే విజయవాడకు చెందిన గిరిజతో వివాహమైంది. ఆమె ప్రస్తుతం 5 నెలల గర్భిణి. ప్రస్తుతం గిరిజ అత్తారింట్లో ఉండగా, సీమంతం చేయాలని ఇటీవల నిర్ణయించారు. ఈ క్రమంలోనే అశోక్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించాడని తెలుసుకున్న ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది.
ఏపీ పీఈటీ, ఎస్‌ఏపీఈ నూతన కార్యవర్గం
● జిల్లా అధ్యక్షుడిగా ఎల్. నాగరాజు, కార్యదర్శిగా ఇ. సిరాజుద్దీన్
అనంతపురం ఎడ్యుకేషన్: ఏపీ పీఈటీ, ఎస్‌ఏపీఈ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో ఆర్‌సీ అక్కులప్ప అధ్యక్షతన జిల్లా ఎన్నికలు నిర్వహించారు. పూర్వపు కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, శివకేశవులు, రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు జోసెఫ్ లక్ష్మయ్య, అస్లాం బాషా సమక్షంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. జిల్లా అధ్యక్షుడిగా ఎల్. నాగరాజు, కార్యదర్శిగా ఇ. సిరాజుద్దీన్, కోశాధికారిగా జి. జగదీశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే జిల్లా ఉపాధ్యక్షురాలిగా సమీరా, సంయుక్త కార్యదర్శిగా జ్యోతి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, అసోసియేషన్ సభ్యులు అభినందించారు. జిల్లాలో పీఈటీ, ఎస్‌ఏపీఈ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఉపాధ్యాయుల హక్కులు, సమస్యలపై సంఘటితంగా పనిచేస్తామని పేర్కొన్నారు.
రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు విఫలం
ఉరవకొండ: కరువు సహాయక చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి విమర్శించారు. శనివారం సీపీఐ జీపుజాత ఉరవకొండకు చేరుకుంది. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నియోజకవర్గ సహాయ కార్యదర్శి సుల్తాన్ అధ్యక్షతన క్లాక్‌టవర్ వద్ద జరిగిన బహిరంగ సమావేశంలో నారాయణస్వామి మాట్లాడారు. జిల్లాపై ఎల్‌నినో ప్రభావంతో అంతటా కరువు ఛాయలు కమ్ముకున్నాయన్నారు. రైతులు దిక్కులేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ పాలన సాగిస్తున్నాయన్నారు. మోదీ ప్రభుత్వం కుల, మత విభేదాలను పెంచే విధానాలను అవలంబిస్తోందన్నారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగిస్తున్నారన్నారు. హంద్రీ–నీవా కాలువను విస్తరించి 6 వేల క్యూసెక్కుల నీటిని తీసుకొస్తే జిల్లాలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. హంద్రీ–నీవా పిల్లకాల్వలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. హెచ్చెల్సీ ఆధునీకరణ చేపట్టి చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న కలెక్టరెట్ ఎదుట ధర్నా చేపట్టనున్నామని, పెద్ద ఎత్తున రైతులు, పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున, రాజారెడ్డి, కేశవరెడ్డి పాల్గొన్నారు.
‘తాడిపత్రిలో నువ్వో..నేనో తేల్చుకుందాం’
తాడిపత్రిటౌన్: ‘తాడిపత్రిలో నువ్వో నేనో తేల్చుకుందాం’ అంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉద్దేశించి టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి పట్టణంలోని తన నివాసంలో ఆయన శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని చూసి భయపడుతున్నారని, కోర్టు ఆదేశాలను ధిక్కరించినా కేతిరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇకపై నో పోలీస్, కోర్టులోనే తేల్చుకుంటాం అంటూ ఊగిపోయారు. వైఎస్సార్‌సీపీ నేతలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ తాడిపత్రిలో ప్రజాసామ్యం లేదు అంటే ఊరుకునేది లేదన్నారు. తాను పడిన బాధలు అవతలి వాళ్లు కూడా అనుభవించాలి అన్నారు.


