ప్లాట్ల ఆక్రమణకు పన్నాగం | - | Sakshi
Sakshi News home page

ప్లాట్ల ఆక్రమణకు పన్నాగం

Aug 9 2026 2:10 AM | Updated on Aug 9 2026 2:10 AM

బాధితులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

రాప్తాడు రూరల్‌: తాము కొనుగోలు చేసిన ప్లాట్లను కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. రాప్తాడు పొలం సర్వే నంబర్‌ 188–1లో సుమారు 1.5 ఎకరాల భూమికి సంబంధించి శనివారం వివాదం తలెత్తింది. కొందరు జేసీబీలతో అక్కడికి చేరుకుని ప్లాట్లకు ఏర్పాటు చేసిన కంచెలను తొలగించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో బాధితులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకోవడంతో కొంతసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బాధితులు నిలదీయడంతో అక్కడికి వచ్చిన వారు వెనక్కి వెళ్లిపోయారు. బాధితుల కథనం ప్రకారం.. కోడెకండ్ల శేఖర్‌నాయుడు, చిరంజీవి అనే వ్యక్తులు తమ ప్లాట్ల విషయంలో దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెబుతూ తమను బెదిరిస్తున్నారని వాపోయారు. తమ వద్ద ఉన్న భూమికి సంబంధించిన పత్రాలను చూపకుండా ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.

ఎనిమిదేళ్ల క్రితం కొనుగోలు చేశా

బాధితురాలు అరుణ మాట్లాడుతూ తాను ఎనిమిదేళ్ల క్రితం 20 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి తరచూ తన స్థలాన్ని పరిశీలించుకుంటూ వస్తున్నానని, ప్లాట్‌కు కంచె ఏర్పాటు చేసి తన మొబైల్‌ నంబర్‌ను కూడా రాసినట్లు చెప్పారు. ఇంతకాలం ఎవరూ ఈ భూమి తమదని చెప్పలేదని, ఇటీవల కొందరు వచ్చి తమ స్థలాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శనివారం జేసీబీతో కంచెను తొలగించేందుకు ప్రయత్నించడంతో తాను వెళ్లి అడ్డుకున్నానని చెప్పారు. తమను బలవంతంగా ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని, వారి వద్ద ఉన్నట్లు చెబుతున్న పత్రాలు ఏమిటో తమకు చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై మాట్లాడితే సీఐ వద్దకు రావాలని చెబుతున్నారని తెలిపారు. మరో బాధితురాలు లలిత మాట్లాడుతూ తాను ఐదేళ్ల క్రితం ప్లాటు కొనుగోలు చేసినట్లు తెలిపారు. శేఖర్‌నాయుడు అనే వ్యక్తి తమ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఫోన్‌లో కూడా తనను బెదిరించారని వాపోయారు. తమ ప్లాట్లపై ఆయనకు ఏ అధికారం ఉందో స్పష్టం చేయకుండా దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించారు.

ఎస్పీకి ఫిర్యాదు చేసినా..

ఈ వ్యవహారంపై గతంలోనే జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. ఎస్పీ సంబంధిత సీఐకి సూచించినప్పటికీ తమ సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. శనివారం సాయంత్రం రాప్తాడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా సీఐ అందుబాటులో లేరని తెలిపారు. తమకు సంబంధించిన ప్లాట్లను రక్షించడంతో పాటు, భూమి పత్రాలను పరిశీలించి న్యాయం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. తాము చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ప్లాట్లపై ఇతరులు జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని, భూ వివాదంపై సమగ్ర విచారణ జరిపి తమకు రక్షణ కల్పించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement