అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్‌లో ప్రధాన పంటలు సాగు చేయలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు విత్తనాలపై 80 శాతం రాయితీ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో అనంతపురం జిల్లాకు సంబంఽధించి ఉలవ, పెసర, అలసంద, జొన్న, కొర్ర తదితర విత్తనాలు 40 వేల క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి మూడు రకాల విత్తనాల ధరలు, రాయితీలు ప్రకటించారు. అందులో ఉలవలు క్వింటా పూర్తీ ధర రూ.7,400 కాగా అందులో 80 శాతం రాయితీ రూ.5,920 పోనూ రైతులు తమ వాటా కింద రూ.1,480 ప్రకారం చెల్లించాలి. అంటే కిలోకు రూ.14.80 ప్రకారం చెల్లిస్తే 10 కిలోలు కలిగిన ప్యాకెట్లు గరిష్టంగా ఒక్కో రైతుకు భూ విస్తీర్ణాన్ని బట్టి రెండు హెక్టార్లకు 5 బ్యాగులు పంపిణీ చేస్తారు. అలాగే అలసందలు క్వింటా పూర్తీ ధర రూ.12,200 కాగా అందులో 80 శాతం రాయితీ రూ.9,760 పోనూ రైతులు తమ వాటా కింద రూ.2,440 ప్రకారం చెల్లించాలి. అంటే కిలోకు రూ.24.40 ప్రకారం చెల్లిస్తే గరిష్టంగా రెండు హెక్టార్లకు 8 కిలోలు కలిగిన ప్యాకెట్లు ఐదు బ్యాగులు పంపిణీ చేస్తారు. కొర్రలు క్వింటా పూర్తీ ధర రూ.6 వేలు కాగా అందులో 80 శాతం రాయితీ రూ.4,800 పోనూ రైతులు తమ వాటా కింద రూ.1200 ప్రకారం చెల్లించాలి. ఈ లెక్కన కిలోకు రూ.12 ప్రకారం చెల్లిస్తే భూ విస్తీర్ణాన్ని బట్టి గరిష్టంగా రెండు కిలోలు కలిగిన ప్యాకెట్లు ఐదు బ్యాగులు ఇస్తారు.
చెలరేగిన మల్లికార్జున
అనంతపురం: జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగుతున్న ఏసీఏ సీనియర్ అంతర్ జిల్లా క్రికెట్ మ్యాచ్‌లో బౌలర్ మల్లికార్జున రాణించాడు. గురువారం ఏసీజీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో అనంతపురం, చిత్తూరు జిల్లా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన చిత్తూరు జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 46.4 ఓవర్ల వద్ద పది వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో తేజారెడ్డి (54), మాధవరాయుడు (44) తప్ప ఎవరూ రాణించలేకపోయారు. అనంత బౌలర్లలో జి.మల్లికార్జున 13.4 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. మరో బౌలర్ దీపక్ 17 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన అనంతపురం జట్టు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 69 పరుగులు సాధించింది. కాగా, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లా జట్లు మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. టాస్ గెలిచి తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వైఎస్సార్ కడప జట్టు 75.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 339 పరుగులు సాధించింది. జట్టులోని వాసుదేవరాజు అద్భుతమైన ఆట తీరుతో 151 పరుగులు సాధించాడు. అదే సమయంలో వర్షం మొదలు కావడంతో ఆటను నిలిపి వేశారు.
47 మంది బీఎల్‌ఓలకు షోకాజ్ నోటీసులు
అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్–2026) కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన 47 మంది బీఎల్‌ఓలకు ఆర్డీఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. లాగిన్ ప్రక్రియ కోసం పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించినప్పటికీ సంబంధిత బీఎల్‌ఓల నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆర్డీఓ ప్రేమంత్‌కుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత బీఎల్‌ఓలు 7న (శుక్రవారం) ఉదయం 11 గంటల్లోపు అనంతపురం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) కార్యాలయంలో హాజరై తమ సంజాయిషీతో పాటు ఎపిక్ కార్డు నంబరు, ఓటీపీ వివరాలను సమర్పించాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా స్పందించకపోతే సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపనున్నట్లు నోటీసులో హెచ్చరించారు.


