● ముందస్తు టీకాలే శరణ్యం
● ఉమ్మడి జిల్లాలో ఉచితంగా 3.77 లక్షల టీకాలు
అనంతపురం అగ్రికల్చర్: పశువులు, గేదెలకు సోకే ముద్ద చర్మవ్యాధి (లంపీ స్కిన్ డిసీస్–ఎల్‌ఎస్‌డీ) అత్యంత ప్రమాదకరమని స్థానిక పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (అనిమల్ డయోగ్నస్టిక్ డిసీసెస్ ల్యాబ్–ఏడీడీఎల్) అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) డాక్టర్ జి.రవిబాబు తెలిపారు. వ్యాధి సోకిన తర్వాత చికిత్స కష్టమని, ముందస్తు నివారణ చర్యలే శ్రేయస్కరమన్నారు. ఇందుకోసం అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎల్‌ఎస్‌డీ వ్యాక్సినేషన్ ఉచితంగా జరుగుతోందని, 3.77 లక్షల డోసుల మందు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 2022లో తీవ్రంగా వ్యాపించిన ఈ వ్యాధితో మరణాలు సంభవించి రైతులకు ఆర్థిక నష్టం చేకూర్చాయని గుర్తు చేశారు. దీంతో రైతులు నాలుగు నెలల కన్నా ఎక్కువ వయస్సున్న తమ పశువులు, గేదెలకు టీకాలు వేయించుకోవాలని సూచించారు.
ఇవీ వ్యాధి లక్షణాలు
ముద్ద చర్మ వ్యాధి ప్రమాదకరమైంది. పశువుల శరీరం, ముఖ్యంగా తల, మెడ, పొదుగు, కాళ్లపై గట్టిగా ఉండే ముద్దలు లేదా గడ్డలుగా ఏర్పడతాయి. తీవ్రమైన జ్వరం రావడం, కళ్లు, ముక్కు నుంచి చొంగ కారడం, పాలిచ్చే పశువుల్లో ఉన్నఫలంగా ఉత్పత్తి బాగా తగ్గిపోవడం, బరువు కోల్పోవడం, నీరసించి బలహీనంగా తయారై ప్రాణనష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. ఈగలు, దోమలు, కీటకాల ద్వారా ఒక పశువు నుంచి మరొకదానికి వ్యాపిస్తుంది. అలాగే కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి నివారణకు ముందస్తు టీకాలు వేయించడం సరైన మార్గం. వ్యాధి లక్షణాలు ఉన్న వాటిని వేరుగా ఉంచడం, ఈగలు, దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర వ్యాధులు ప్రబలకుండా పశువైద్యుని సూచన మేరకు యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడాలి. ఇప్పుడు ప్రధానంగా తెల్లజాతి పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలి. అనంతపురం డివిజన్‌కు 1.05 లక్షల డోసులు, ఉరవకొండ డివిజన్‌కు 67,800 డోసులు, ధర్మవరం డివిజన్‌కు 50,300 డోసులు, హిందూపురం డివిజన్‌కు రూ.79,900 డోసులు, పెనుకొండ డివిజన్‌కు 74,600 డోసుల మందు సరఫరా చేసినట్లు ఏడీడీఎల్ ఏడీ రవిబాబు పేర్కొన్నారు. ఎక్కడిక్కడ పశుశాఖ అధికారులు, డాక్టర్లు, పారాస్టాఫ్, వీఏహెచ్‌ఏలను సంప్రదించి నెలాఖరులోపు పాడి రైతులు పశువులకు టీకాలు వేయించుకోవాలని సూచించారు.


