ఉరవకొండ: హత్యాయత్నం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉరవకొండలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ మహానంది, ఎస్‌ఐ జనార్దన్‌నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కౌకుంట్ల గ్రామానికి చెందిన రాము, శేఖర్‌లు అన్నదమ్ములు. వీరికి తండ్రి చెరో రెండున్నర ఎకరాల పొలాన్ని ఇచ్చాడు. శేఖర్ పొలంలో నీటి లభ్యత ఎక్కువగా ఉండటంతో దాన్ని వాడుకొనే విషయంలో అన్నదమ్ములు ఘర్షణ పడేవారు. ఈ నెల 1న తెల్లవారుజామున రాము తమ్ముడి పొలంలో ఫ్యూజు క్యారియర్లు తొలగించి తీసుకెళుతుండగా గమనించిన శేఖర్ అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. అనంతరం శేఖర్ తన భార్యతో బైక్‌పై వెళ్తుండగా గ్రామ శివారులో రాము వారిని కారుతో ఢీకొట్టాడు. వెంట తెచ్చుకున్న హకీ స్టిక్‌తో శేఖర్ తల, కణితిపై విచక్షణరహితంగా కొట్టాడు. చనిపోయాడని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ శేఖర్‌ను భార్య కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం రామును చిన్నముస్టూరు కల్లబండ ఆంజినేయస్వామి ఆలయం వద్ద అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి కారు, హాకీ స్టిక్, 3 కరెంట్ ఫీజులు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు సీఐ మహానంది తెలిపారు.


